మైనర్ బాలికను వేధింపులకు గురి చేసిన తీవ్ర ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్ని ఎంతలా ప్రభావితం చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బండి భగీరథ్ ను అరెస్టు చేసే వరకు వివిధ రాజకీయ పక్షాలు మొదలుకొని.. ప్రజా సంఘాలు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒత్తిడిని తీసుకొచ్చాయని చెప్పాలి. గత శనివారం రాత్రి వేళలో నాటకీయ పరిణామాల నేపథ్యంలో బండి భగీరథ్ ను పోలీసులు అరెస్టు చేయగా.. తానే పోలీసులకు లొంగిపోవాలని చెప్పినట్లుగా కేంద్ర హోం సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ప్రకటించారు. సాధారణంగా తీవ్ర ఆరోపణల విషయంలో విమర్శలు.. తీవ్ర ఆరోపణలు మామూలే. అందుకు భిన్నంగా బండి భగీరథ్ విషయంలో ఒక అంశం ఉందని చెప్పాలి.
సాధారణంగా తీవ్ర నేర ఆరోపణలు వచ్చినప్పుడు వారు అరెస్టు అయ్యే వరకు ఆ అంశానికి తీవ్ర ప్రాధాన్యత ఉంటుంది. బండి విషయంలో మాత్రం.. అరెస్టు అయ్యాక కూడా రాజకీయ విమర్శలు తప్పని పరిస్థితి. తాజాగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాలి. ఒక పోక్సో కేసు నిందితుడ్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాచి పెట్టి సందర్భం దేశంలో మరెక్కడా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దాచి ఉంచారన్న కేటీఆర్.. అందుకు కొనసాగింపుగా మరిన్ని వ్యాఖ్యలు చేయటం కొత్త కలకలంగా మారింది.
బండి భగీరథ్ ను ముఖ్యమంత్రి సమీప బంధువుకు చెందిన ఆసుపత్రిలోని 28వ అంతస్తులో తొమ్మిది రోజుల పాటు దాచారన్నారు. తాను చెబుతున్న ఈ మాటలకు మూలం తాను చూసిన ఒక వీడియోగా కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరూ ఇద్దరేనని.. వారిద్దరూ కుమ్మక్కయ్యారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
బండి భగీరథ్ మీద కేసు పెట్టటానికి బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళితే.. తమ రాజకీయాల కోసం కౌంటర్ కేసు పెట్టించి ఆమెకు అన్యాయం చేసిన వెధవ ఎవరో చెప్పాలంటూ సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడైనా పోక్సో కేసులో నిందితులు తొమ్మిది రోజులు తప్పించుకోలేదని.. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ అండదండలు ఉండటంతోనే బండి భగీరథ్ తొమ్మిది రోజులు తప్పించుకున్నట్లుగా పేర్కొన్నారు.
తన బావమరిది ఇంటిపై డ్రగ్స్ దాడి జరిగిందంటూ మాట్లాడుతున్న సీఎం రేవంత్ .. ఆ అంశంలో కేసు ఎందుకు పెట్టటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే ఆ అంశంలో కేసు పెట్టి.. విచారణ చేపట్టాలంటూ సవాలు విసరటం విశేషం. ఈ మధ్యనే కేటీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ కు కౌంటర్ గా ఆయన ఈ రీతిలో రియాక్టు అయినట్లుగా చెప్పాలి.