హిందువులు అయినంత మాత్రాన.. అదే పనిగా ఆలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హిందూ త్వం అనేది కేవలం ఒక జీవన శైలి మాత్రమేనని, దీనిని నిరూపించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంట్లో దీపం వెలిగించినప్పటికీ.. హిందువుగానే పరిగణించవచ్చని పేర్కొంది. విశ్వాసానికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది. కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను ప్రవేశింప జేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం కొన్ని రోజులుగా విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా మరోసారి విచారించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మా సనం హిందూ మతంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది కేవలం విశ్వాసానికి సంబంధించిన విషయమేనని పేర్కొంది. ఎవరి కోసమో.. దీనిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హిందువునని తనకు తాను నమ్మితే చాలన్న ధర్మాసనం.. ఆ మేరకు ఇంట్లో దీపం వెలిగించుకున్నా.. చాలని అభిప్రాయపడింది. ప్రతి ఒక్కరూ ఆలయానికి వెళ్లడం ప్రారంభిస్తే.. దేవాలయాల ముందు.. హౌస్ ఫుల్ బోర్డులు పెట్టే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించింది.
ఎవరి విశ్వాసాలను వారు గౌరవించుకోవాలన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరింది. అందరూ పరమతసహనం పాటించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని ఎవరూ కాదనలేరని స్పష్టం చేసిన కోర్టు.. ఈ విషయంలో ప్రతి విశ్వాసాన్నీ.. ప్రతి మతంలోని ఆచారాలను సవాల్ చేస్తూ ఉంటే.. కోర్టులకు సమయం చాలని తెలిపింది. ఆచారాలు, మతాలు.. విశ్వాసానికి సంబంధించినవి, మనిషిని సన్మార్గంలో నడిపేందుకు అవిదోహదపడతాయని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. దీనిపై సవాల్ చేయడం ద్వారా సమయం వృథానేనని స్పష్టం చేశారు. మత సంబంధిత అంశాలను విచారిస్తూ.. ఉంటే గుట్టలు గుట్టలుగా పిటిషన్లు వస్తాయని అభిప్రాయపడ్డారు.