సూర్య సినిమాకు ఊహించ‌ని అడ్డంకులు

admin
Published by Admin — May 14, 2026 in Movies
News Image
తెలుగులో మాదిరే త‌మిళంలోనూ ఈ ఏడాది స‌రైన సినిమాలు లేక బాక్సాఫీస్ వెల‌వెల‌బోతోంది. ఇలాంటి టైంలో సూర్య లాంటి పెద్ద హీరో సినిమా క‌రుప్పు విడుద‌ల కాబోతుండ‌డంతో దాని మీద చాలా ఆశ‌ల‌తో ఉంది ట్రేడ్. సినీ రంగం నుంచి వెళ్లి ముఖ్య‌మంత్రి అయిన విజ‌య్... ఈ సినిమాకు ఉద‌యం స్పెష‌ల్ షోలు వేసుకునేందుకు అనుమ‌తి కూడా ఇచ్చాడు. సూర్య నుంచి చాన్నాళ్ల త‌ర్వాత వ‌స్తున్న మాస్ సినిమా కావ‌డంతో అభిమానులు థియేట‌ర్ల‌లో పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. త‌మిళ‌నాట‌ ఉద‌యం 9 గంట‌ల షోల‌న్నీ సోల్డ్ ఔట్ అయ్యాయి.
 
విదేశాల్లోనూ ప్రిమియ‌ర్స్‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఇంత‌లో క‌రుప్పు చిత్రానికి ఊహించ‌ని అడ్డంకులు ఎదుర‌య్యాయి. ఈ సినిమాకు సంబంధించి ఆర్థిక వ్య‌వ‌హారాలేవో తేల‌క బుకింగ్స్ నిలిచిపోయాయి. వ‌రుస‌గా ఒక్కో థియేట‌ర్ క‌రుప్పు సినిమా బుకింగ్స్ ఆపేయ‌డం.. మొత్తంగా ఆ సినిమాను లిస్టింగ్ నుంచి తీసేయ‌డం చేస్తున్నాయి. నిర్మాత‌కు ఫైనాన్స్ వివాదాలేమైనా ఉన్నాయా.. లేక డిస్ట్రిబ్యూట‌ర్‌తో స‌మ‌స్య‌నా.. లేక ఎగ్జిబిట‌ర్ల‌తో గొడ‌వ త‌లెత్తిందా అన్న‌ది స్ప‌ష్ట‌త లేదు.
 
కానీ సాయంత్రం వ‌ర‌కు లేని ఇబ్బంది రాత్రి మొద‌లైంది. బుకింగ్స్ నిలిచిపోయాయి. ద‌ర్శ‌క నిర్మాత‌లు రంగంలోకి దిగి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సూర్య కూడా జోక్యం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కానీ స‌మ‌స్య ప‌రిష్కార‌మై ఉద‌యం య‌థావిధిగా షోలు ప‌డ‌తాయా అన్న‌ది అనుమానంగా ఉంది. త‌మిళంలో మార్నింగ్ షోలు ప‌డ‌క‌పోతే.. తెలుగులో కూడా రిలీజ్ ఆగిపోయే అవ‌కాశ‌ముంది. ప్ర‌స్తుతానికి ఇక్క‌డ బుకింగ్స్ అయితే ఆగిపోలేదు. ముందున్న థియేట‌ర్ల లిస్టింగ్ అలాగే కొన‌సాగుతోంది.
 
త‌మిళంలో మాత్రం చాలా చోట్లా బుకింగ్స్ ఆగిపోయాయి. మ‌రి అర్ధ‌రాత్రి దాటాక అయినా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుని రిలీజ్ క్లియ‌రెన్స్ తెచ్చుకుంటారేమో చూడాలి. మిడ్ స‌మ్మ‌ర్లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అనుకూల ప‌రిస్థితులున్న స‌మ‌యంలో ఇలాంటి ఒక పెద్ద సినిమా రిలీజ్‌కు అడ్డంకులు రావ‌డం విచార‌క‌రం.
Tags
hero suriya veerabhadrudu movie obstacles
Recent Comments
Leave a Comment

Related News