తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బండి భగీరథ్(Bandi Bhagirath) కేసు పెను సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి తనయుడు కావడం ఒకెత్తయితే, నమోదైంది ‘పోక్సో’ (POCSO) కేసు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని పోలీసులు డెడ్ లైన్ విధించినప్పటికీ.. భగీరథ్ గైర్హాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖాకీల నోటీసులను బండి తనయుడు బేఖాతరు చేశారా? లేక దీని వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
విచారణకు హాజరుకాకపోవడానికి ప్రధాన కారణం న్యాయపరమైన రక్షణే అని తెలుస్తోంది. అరెస్ట్ గండం పొంచి ఉండటంతో, భగీరథ్ తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఇచ్చే నిర్ణయం కోసమే ఆయన వేచి చూస్తున్నట్లు సమాచారం. అయితే, విచారణకు సహకరించని పక్షంలో తాము తగ్గబోమని పోలీసులు సంకేతాలిస్తున్నారు. ఒకవేళ కోర్టు నుంచి తక్షణ ఊరట లభించకపోతే, పోలీసులు భగీరథ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఏ క్షణమైనా రంగం సిద్ధం చేసే అవకాశం ఉంది.
ఈ కేసును మలుపు తిప్పుతున్న మరో అంశం బాధితురాలి వయస్సు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పత్రాలు బాధితురాలు అసలు మైనర్ కాదని, ఆమె వయస్సుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వాదిస్తున్నాయి. రెండు వేర్వేరు పుట్టిన తేదీలతో ఉన్న సర్టిఫికెట్లు వెలుగులోకి రావడంతో సిట్ (SIT) అధికారులు ఇప్పుడు ఆ డాక్యుమెంట్ల ప్రామాణికతను చెక్ చేసే పనిలో పడ్డారు. ఒకవేళ ఆమె మైనర్ కాదని తేలితే కేసు దిశ మారిపోతుంది. కానీ పోలీసులు కేసులో ఇప్పటికే సెక్షన్లను మరింత కఠినతరం చేయడం గమనార్హం.
మరోవైపు రాజకీయంగా కూడా ఈ వ్యవహారం హీటెక్కిస్తోంది. టీపీసీసీ(TPCC) చీఫ్ మహేష్ గౌడ్ ఈ కేసుపై స్పందిస్తూ.. నిందితుడు ఎంతటి బలవంతుడైనా సరే, చట్టం నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని, ఈ విషయంలో ఎవరికీ వెసులుబాటు కల్పించాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రెండోసారి రికార్డు చేసిన పోలీసులు, అరెస్టుపై ఎప్పుడు ముందడుగు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.