అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు, యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఇచ్చిన పొదుపు పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పిలుపునకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు. కేవలం సంఘీభావం తెలపడమే కాకుండా, రాష్ట్రంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశం కోసం ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చమురు సంక్షోభం, రవాణా భారాలను దృష్టిలో ఉంచుకుని 'వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home)' విధానాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగానే ఐటీ రంగానికే పరిమితమైన ఈ సంస్కృతిని ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో కూడా ప్రవేశపెట్టేందుకు బాబు సిద్ధమయ్యారు. "వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నేటి రియాలిటీ.. దీనిని మనం అందిపుచ్చుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలపై నిర్వహణ భారం కూడా తగ్గుతుందని ఆయన భావిస్తున్నారు.
ముఖ్యంగా సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సీఎం పేర్కొన్నారు. ప్రధాని సూచించినట్లుగా బంగారం(Gold) కొనుగోలును ఏడాది పాటు వాయిదా వేయడం, వంట గ్యాస్, చమురు వినియోగంలో పొదుపు పాటించడం వంటి ఎనిమిది సూత్రాలను పాటించాలని ప్రజలను కోరారు. యుద్ధం వల్ల తలెత్తే తాత్కాలిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వంతో పాటు పౌరులు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వినూత్న కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి గైడ్‌లైన్స్‌ను ప్రకటించనుంది. ప్రభుత్వంలోని ఏయే విభాగాలకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించవచ్చు? సాంకేతికతను వాడుకుని పాలనను ఎలా మెరుగుపరచవచ్చు? అనే అంశాలపై బాబు మార్క్ కసరత్తు జరుగుతోంది. సంక్షోభాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకుని, ఏపీని సరికొత్త దిశలో నడిపించేందుకు చంద్రబాబు(Chandrababu) సిద్ధమవుతున్న ఈ తీరు ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.