రానా దగ్గుబాటి(Rana Daggubati) సతీమణి మిహికా బజాజ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. కేవలం దగ్గుబాటి కోడలు అనే గుర్తింపుకే పరిమితం కాకుండా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మిహీకా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, గత కొంతకాలంగా మిహికా వెండితెరపై మెరవబోతోందని, త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఆమె గ్లామరస్ ఫోటోషూట్లు, ఓటీటీ షోలలో మెరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
తాజాగా ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న మిహికా బజాజ్(Miheeka Bajaj), తన సినీరంగ ప్రవేశంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. తాను హీరోయిన్‌గా నటించే అవకాశం లేదని స్పష్టం చేస్తూనే, సినిమా పరిశ్రమపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. "నాకు సినిమాలన్నా, నటీనటులన్నా చాలా గౌరవం ఉంది. కానీ కెమెరా ముందుకు వచ్చి నటించడం నా వల్ల కాదు. కథలు చెప్పడం అనేది ఒక అద్భుతమైన కళ, అది నైపుణ్యం ఉన్నవారే చేయాలి" అని ఆమె అభిప్రాయపడ్డారు. దీంతో మిహికాను తెరపై చూడాలనుకున్న అభిమానులకు కాస్త నిరాశే ఎదురైందని చెప్పాలి.
అయితే నటనకు నో చెప్పినప్పటికీ, మిహికా(Miheeka)కు సినిమా నిర్మాణ ప్రక్రియ పట్ల ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైనర్‌గా సక్సెస్ అయిన ఆమె, భవిష్యత్తులో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ లేదా ప్రొడక్షన్ రంగంలో పని చేసే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. "నేను ఒకవేళ సినిమాల్లో పని చేయాల్సి వస్తే, అది కచ్చితంగా కెమెరా వెనుకే ఉంటుంది. నాకున్న డిజైనింగ్ ట్యాలెంట్‌ను అక్కడ ఉపయోగిస్తాను" అని పేర్కొన్నారు. అంటే, భవిష్యత్తులో దగ్గుబాటి వారి సినిమాలకు మిహికా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి తెరపై కనిపించకపోయినా, తనదైన సృజనాత్మకతతో పరిశ్రమలో భాగం కావడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.