వైసీపీ నేతలు కట్టుదాటరు అంటారు. జగన్ మాటే శిలాశాసనం అని కూడా చెబుతుంటారు. కానీ, దీనికి భిన్నంగా వైసీపీ తరఫున గెలిచిన మునిసిపల్ కౌన్సిలర్లు కొందరు రెండుగా చీలిపోయారు. కొందరు టీడీపీకి, మరికొందరు జనసేనకు జై కొట్టారు. పోనీ వీరేమన్నా.. పార్టీలు మారారా? కండువాలు మార్చేశారా? అంటే.. అదేమీ లేదు. నేరుగా పార్టీ ఏమీ మారకుండానే వారు వైసీపీలోనే ఉండి.. ఇరు కూటమి పార్టీల అభ్యర్థులకు జై కొట్టడం రాజకీయంగా ఆసక్తిగా.. ఆశ్యర్యంగా కూడా మారింది.
విషయం ఏంటి?
ఉమ్మడి విజయనగరంలోని సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో కూటమి పార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మునిసిపాలిటీలో రెండో కీలక పదవిగా భావించే వైస్ చైర్మన్‌పదవి విషయంలో టీడీపీ, జనసేన నాయకులు కలివిడిగా కాకుండా.. రెండు వర్గాలుగా చీలిపోయారు. మాకంటే మాకే ఈ పదవి కావాలని పట్టుబట్టారు. దీనిపై సుదీర్ఘకాలం కసరత్తు సాగింది. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి.. కొన్నాళ్ల కిందట.. బహిరంగ వేదికపై కన్నీరు పెట్టుకోవడం బాహాటంగానే బోరున ఏడ్చేయడం తెలిసిందే.
సాలూరులో జనసేన కు బలం లేదని, అయినా.. ఇక్కడి చైర్మన్ సీటును జనసేనకు కేటాయించారని టీడీపీ నేతలు ఆగ్రహించారు. మంత్రి కన్నీరు పెట్టారు. అయినా.. కూటమి అధిష్టానాలు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో వైస్ చైర్మన్ సీటును మాత్రం టీడీపీకి కేటాయించారు. అంటే.. చైర్మన్ సీటును జనసేనకు, వైస్ చైర్మన్ సీటును టీడీపీకి ఇచ్చారు. కానీ.. ఇక్కడే జనసేన, టీడీపీ నేతల మధ్య మళ్లీ వివాదాలు ప్రారంభమయ్యాయి. చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ సీటును కూడా తమకే ఇవ్వాలని జనసేన నాయకులు పట్టుబట్టారు.
చివరకు వైస్ చైర్మన్ ఎన్నిక వచ్చేసింది. గెలిచిన కౌన్సిలర్లు.. చేతులు ఎత్తడం ద్వారా.. వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవాలి. కానీ.. జనసేన-టీడీపీ వేరు పడి.. ఎవరికి వారు అభ్యర్థులను రంగంలోకి దించేశారు. దీంతో టీడీపీకి, జనసేనకు కూడా మెజారిటీ లేకుండా పోయి.. వైస్ చైర్మన్ ఎన్నిక గందరగోళం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో జనసేన నాయకులు ఒకవైపు, టీడీపీ నేతలు, మంత్రి మరోవైపు.. వైసీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్లను మచ్చిక చేసుకున్నారు. వైసీపీ నుంచి మొత్తం 12 మంది గెలిచారు. వీరిలో 9 మంది జనసేన అభ్యర్థికి అనుకూలంగా చేతులు ఎత్తేశారు. మిగిలిన ముగ్గరు టీడీపీ అభ్యర్థికి అనుకూలం గా ఓటేశారు.
అయితే.. టీడీపీలో సంఖ్యా బలం ఎక్కువగా ఉండడంతో ఈ పార్టీ తరఫున వైస్ చైర్మన్‌గా నిలబడిన మోహన్ అనే వ్యక్తి విజయం దక్కించుకున్నారు. కాగా.. అటు జనసేనకు, ఇటు టీడీపీకి కూడా వైసీపీ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడం.. ఆశ్చర్యంగా ఉంది. ఈ వ్యవహారంపై జనసేన సీరియస్ అయింది. ఇలా.. వైసీపీ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తప్పవని పార్టీ హెచ్చరించింది. మరి ఏంచేస్తారో చూడాలి.