బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోకి తన సోదరి షర్మిల అడుగు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్‌పై శనివారం సాయంత్రం స్థానిక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. షర్మిల సహా.. ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ప్యాలెస్‌లోకి అడుగు పెట్టరాదని ఉత్తర్వుల్లో దేవనహళ్లి కోర్టు స్పష్టం చేసింది. అయితే, కోర్టు తీర్పు తర్వాత కూడా షర్మిల యలహంక వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, ఆమె వాహనాన్ని నడిరోడ్డుపై బెంగుళూరు పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, కాబట్టి వేరే మార్గం నుంచి వెళ్లాలని సూచించారు.
పూర్తి తీర్పు ఇదీ..
``ప్రతివాది షర్మిల.. ఆమె కుటుంబం, ఏజెంట్లు, ప్రతినిధులు, అనుచరులు, ఆమె ద్వారా లేదా ఆమె తరఫున హక్కులు కోరుతున్న ఏ ఇతర వ్యక్తులైనా షెడ్యూల్ ఆస్తిలోకి ప్రవేశించకుండా ఆదేశాలు ఇస్తున్నాం. ఆ ఆస్తిపై నివాసం, యాజమాన్యం లేదా మరే ఇతర హక్కునైనా కోరకుండా నిరోధించే ఆదేశాలు జారీ చేస్తున్నాం. షెడ్యూల్ ఆస్తిపై ఉన్న గోడలు, సరిహద్దులు, కంచెలు, నిర్మాణాలు, చరాస్తులను పాడుచేయడం, నాశనం చేయడం, తొలగించడం, వాటిని పాడు చేయడం, ఇతరత్రా జోక్యం చేసుకోకుండా ప్రతివాదిని(షర్మిల), ఆమె కుటుంబాన్ని, ఏజెంట్లను, ప్రతినిధులను, అనుచరులను, ఆమె ద్వారా హక్కులు కోరే ఏ ఇతర వ్యక్తులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
న్యాయం, సమానత్వం ప్రయోజనాల దృష్ట్యా ఈ కేసులోని క్లుప్త వాస్తవాలు ఏమిటంటే..,``ఇ.సి. సుగుణమ్మతో 01-03-2007న కుదుర్చుకున్న కౌలు ఒప్పందం ప్రకారం, వివాదాస్పద ఆస్తి తన ఆధీనంలో, అనుభవంలో ఉందని వాది(జగన్) పేర్కొంటున్నారు. ఈ ఒప్పందం 28-02-2027 వరకు అమలులో ఉంటుంది. సదరు ఒప్పందం మేరకు వాదికి ఆస్తి అప్పగించబడింది. ఆయన అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అలాగేచెట్లు, మొక్కలు, నీటి పారుదల సౌకర్యాలు, అతిథి గృహాలు, ఇతర నిర్మాణాలను నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా, కౌలుకు ఇచ్చిన వ్యక్తి తదనంతరం 27-08-2026 తేదీన తన కుమార్తె, మనవరాళ్ల పేరిట రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేశారని, తద్వారా కౌలు ఒప్పందం వారికి బదిలీ అవుతుంది. గతంలో అతిథి గృహంలో తాత్కాలికంగా ఉండటానికి అనుమతి పొందిన ప్రతివాది(షర్మిల), ప్రస్తుతం పెళ్లి పనుల పేరుతో ఇతర వ్యక్తులను ఆ ఆస్తి వద్దకు పంపి, ఆస్తి స్వాధీనానికి ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని వాది(జగన్) ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దావా పత్రం, దరఖాస్తు, అఫిడవిట్ మరియు ఆ దరఖాస్తుతో పాటు సమర్పించిన పత్రాలను పరిశీలించాను.`` అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
అంతేకాదు.. ``రికార్డులో ఉంచిన అంశాలను పరిశీలించగా, వాది(జగన్) తన ఆధీనంలో, అనుభవంలో వివాదాస్పద ఆస్తి ఉన్నట్లు నిరూపించేందుకు 01-03-2007 నాటి కౌలు ఒప్పంద పత్రం, అద్దె చెల్లింపు వివరాలు, విద్యుత్ బిల్లులు, భద్రతకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను సమర్పించారు. అంతేకాకుండా, 27-08-2026 నాటి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ పత్రాలను, తదనంతరం కౌలు ఒప్పందాన్ని కొత్త యజమానికి బదిలీ చేసినట్లు తెలిపే పత్రాలను కూడా కోర్టుకు సమర్పించారు. `` అని న్యాయమూర్తి తెలిపారు.
``వాది(జగన్) సమర్పించిన పత్రాలు, దావా షెడ్యూల్ ఆస్తిని కౌలుదారుగా స్వాధీనంలో ఉంచుకుని అనుభవిస్తున్నారన్న వాదనను ప్రాథమికంగా బలపరుస్తున్నాయి. అంతేకాకుండా, వాది(జగన్) వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టడం ద్వారా ఆస్తిని అభివృద్ధి చేశారు. చెట్లు, మొక్కలు, అతిథి గృహాలు, నిర్వహిస్తున్నారు.`` అని 4 పేజీల తీర్పులో న్యాయమూర్తి పేర్కొంటూ .. షర్మిల ఆ ఆస్తి జోలికి వెళ్లరాదని ఆదేశించారు.