ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక అంశం హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల కోసం సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా, ఇకపై ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో 'వయసు'ను ఒక ప్రధాన ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన నేతల స్థానంలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
నిజానికి, ఏపీ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో యువ నాయకత్వానికి పెరుగుతున్న ఆదరణను అధినాయకత్వం నిశితంగా గమనిస్తోంది. ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ(TDP) 2024 ఎన్నికల్లో అనుసరించిన 'యంగ్ బ్లడ్' ఫార్ములా ఆ పార్టీకి మంచి ఫలితాలను ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో సగానికి పైగా కొత్త ముఖాలు, యువ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఓటర్లలో ఒక రకమైన సానుకూల దృక్పథాన్ని ఏర్పరచగలిగారు. ఇప్పుడు అదే తరహా మార్పు వైసీపీలోనూ రావాలని, మారుతున్న 'జెన్ జీ' (Gen-Z) ఓటర్ల నాడిని పట్టుకోవాలంటే పార్టీ ముఖచిత్రం మారాల్సిందేనని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.
గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే, వైసీపీ(YCP)లో ఎక్కువగా సీనియర్ల ఆధిపత్యమే కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన నేతలే జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. అయితే, క్షేత్రస్థాయిలో మారుతున్న పరిస్థితులు, యువ ఓటర్ల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని నడిపించడంలో పాత తరం నేతలు కొంత వెనుకబడ్డారనే అభిప్రాయం పార్టీ అంతర్గత సమీక్షల్లో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు, సగానికి పైగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే నివేదికలు అధినాయకత్వాన్ని ఈ కఠిన నిర్ణయం వైపు నడిపిస్తున్నాయని పార్టీ వర్గాల భోగట్టా.
ఈ నేపథ్యంలోనే 25 నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న ఉత్సాహవంతులను గుర్తించి, వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలనే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు వినికిడి. ఒకవేళ "50 ఏళ్లు దాటితే టికెట్ కట్" అనే నిబంధన కనుక అమల్లోకి వస్తే, వైసీపీలో దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న ఎందరో హేమాహేమీల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అయితే, అనుభవాన్ని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లవచ్చని కొందరు సీనియర్లు వాదిస్తుండగా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ సర్జరీ తప్పదని మరికొందరు సమర్థిస్తున్నారు. మరి జగన్(Jagan) తీసుకునే ఈ ఏజ్ లిమిట్ నిర్ణయం పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.