వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌పై కాంగ్రెస్ పార్టీఏపీ చీఫ్ షర్మిల నిప్పులు చెరిగారు. ఇటీవలే ఇరువురి మధ్య తన కుమార్తె విషయం లో వివాదం జరిగిన విషయం ఇంకా చల్లారక ముందే.. మరో వివాదం తెరమీదికి రావడం గమనార్హం. తన కుమార్తె అంజలి వివాహానికి బెంగళూరులోని ప్యాలెస్‌ను ఇచ్చేందుకు జగన్ ససేమిరా అన్న విషయం తెలిసిందే. దీంతో దాదాపు వారం రోజులు ఈ వ్యవహారం అన్నా-చెల్లి మధ్య వివాదంగా మారింది. బహిరంగ వేదికగానే ఈ విషయంపై ఇరువురు విమర్శించుకున్నారు. ఇది కొంత సర్దుమణుగుతోందన్న సమయంలో అనూహ్యంగా ఈ వివాహం చుట్టూనే మరో వివాదం తెరమీదికి వచ్చింది.
``చంద్రబాబుతో నావి చెట్టాపట్టాలా.. జగన్? ఇదేం నీచం`` అంటూ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తె అంజలి-వరుడు రఘురామ్ రెడ్డిల వివాహ ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు రెండు రోజుల కిందట షర్మిల ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంపై మంగళవారం ప్రత్యేక కథనం రాసిన జగన్ మీడియా.. తనను అవమానించేలా చేసిందని షర్మిల వ్యాఖ్యానిం చారు. `తండ్రి వయసున్న వ్యక్తితో ఆత్మీయ సంబంధం` అంటగడతారా? అంటూ ఆమె నిలదీశారు. రాజకీయ, వ్యక్తిగత కోణాన్ని ఆపాదిస్తూ కథనం రాస్తారా? అని ఆమె నిప్పులు చెరిగారు.
షర్మిల ద్వంద్వ రాజకీయ వైఖరి ప్రదర్శిస్తున్నారనే అర్థం వచ్చేలా ఆ కథనం సాగిందని విమర్శించారు. తన తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే దానికి "చెట్టాపట్టాలు", "ఆత్మీయ సంబంధాలు" అంటూ అర్థాలు తీస్తారా అని షర్మిల ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డపై ఇలాంటి నీలాపనిందలు వేయడం దిగజారుడు సంస్కారానికి నిదర్శనమన్నారు గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన పిల్లల వివాహ వేడుకలకు చంద్రబాబును ఆహ్వానించారని షర్మిల గుర్తు చేశారు. పెళ్లి పిలుపులోనూ రాజకీయాలు వెతకడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
ఇదేనా మహిళలంటే గౌరవం?
మహిళల పట్ల గౌరవం ఉందని, అక్కాచెల్లి అంటూ.. ఎన్నికల సమయంలో చెప్పుకొనే జగన్.. సొంత పత్రికలో తల్లి, చెల్లి అనే తేడా లేకుండా ఇలాంటి కథనాలు రాస్తుంటే ఎలా సమర్థించుకుంటారని షర్మిల నిలదీశారు. ఈ కథనానికి పత్రిక యాజమాన్యం, జగన్ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి విషయంలోనూ తప్పుడు ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బురద రాజకీయాలు ఆపాదిస్తున్నారని విమర్శించారు. కాగా.. దీనిపై వైసీపీ సహా జగన్ మీడియా నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం గమనార్హం.