రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు ఎప్పుడూ ఒకేలా ఉండరంటారు. పరిస్థితులను బట్టి సమీకరణాలు మారుతుంటాయి. సరిగ్గా ఇదే సూత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాజకీయంగా ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఒకే వేదికపైకి రావడం వెనుక బలమైన కారణమే ఉంది. అదే షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం.
నవంబర్ 25న జరగనున్న కూతురి పెళ్లి కోసం షర్మిల ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో చంద్రబాబు(Chadhrababu)ను కలిసి వెడ్డింగ్ కార్డ్ అందజేశారు. ఇద్దరి మధ్య కొంతసేపు ఆత్మీయంగా చర్చ జరగడం, ఇందుకు సంబంధించిన ఫొటోలు క్షణాల్లో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. పార్టీలు వేరైనా, వ్యక్తిగత ఆహ్వానం పేరుతో షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికర పరిణామంగా మారింది.
అయితే, ఈ ఎపిసోడ్‌లో అసలు ట్విస్ట్ వేరే ఉంది. ఒకవైపు రాజకీయ దిగ్గజాలు, ఇతర పార్టీల నేతలను సామాజికంగా, గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్న షర్మిల.. తన సొంత అన్న, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy)ని మాత్రం ఈ పెళ్లికి దూరం పెట్టారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. బెంగళూరులోని ఉమ్మడి నివాసంలో కూతురి వివాహం చేయాలని షర్మిల భావించినా, భద్రతా కారణాలంటూ జగన్ దానికి నో చెప్పడం ఇటీవల పెను దుమారమే రేపింది. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా ఎక్స్ వేదికగా బహిరంగపరుస్తూ తన వేదన వెళ్లగక్కారు.
అన్నతో ఉన్న ఈ ఆత్మీయ దూరం, విభేదాలు ఇప్పుడు కూతురి పెళ్లి ఆహ్వానాల విషయంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంత అన్నను పక్కన పెట్టి, రాజకీయ ప్రత్యర్థిగా భావించే చంద్రబాబును కూతురి పెళ్లికి ఆహ్వానించడం ద్వారా షర్మిల ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు? ఈ వివాహానికి చంద్రబాబు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారడమే కాకుండా, ఏపీ(AP) పాలిటిక్స్‌లో కొత్త చర్చకు తెరలేపింది.