ఏపీలో మున్సిప‌ల్ వార్‌.. వైసీపీ అలా, కూట‌మి ఇలా!

admin
Published by Admin — November 17, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో మరో రాజకీయ రణక్షేత్రానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే వాయిదా పడిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల పోరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 26న జరగనున్న ఈ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తున్న అధికార కూటమి, ఎలాగైనా పుంజుకోవాలని చూస్తున్న ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

అర్బన్ బాడీస్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికి వైసీపీ(YCP) అధిష్టానం ఈసార గట్టిగానే కసరత్తు చేసింది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటించిన మేయర్, చైర్మన్ అభ్యర్థుల జాబితాలో స్థానిక రాజకీయ సమీకరణాలకు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యానికి పెద్దపీట వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లతో పాటు వివిధ మున్సిపాలిటీలకు ఖరారు చేసిన అభ్యర్థుల ఎంపికలో ఈ ప్రయోగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే, అన్ని స్థానాల్లోనూ పోటీ ఇస్తున్నప్పటికీ.. కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలపై ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ముఖ్యంగా శ్రీకాకుళం(Srikakulam)లో స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలు తమకు అనుకూలంగా మారుతాయని, కూటమిలోని కొన్ని అంతర్గత సమీకరణాలు తమ విజయానికి బాటలు వేస్తాయని వైసీపీ ధీమాగా ఉంది. అలాగే కాకినాడలోనూ సరికొత్త ప్రయోగాలతో బరిలోకి దిగి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. కొన్ని మున్సిపాలిటీల్లోనూ పక్కా ప్లాన్‌తో పీఠం దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

మరోవైపు, అధికార కూటమి(NDA) మాత్రం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తుండటంతో ఈ ఎన్నికల్లోనూ గత విజయాల జోరును కొనసాగించాలని చూస్తున్నాయి. "శాతం ఒక్కటి కూడా తగ్గకుండా, మొత్తం 23 స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేస్తాం" అని కూటమి నాయకులు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రదర్శించిన ఐక్యతను ఇక్కడ కూడా రిపీట్ చేసి, ప్రత్యర్థి పార్టీకి కనీసం గెలుపు అవకాశాలు కూడా ఇవ్వకూడదని కూటమి నేతలు పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాలనా పరమైన అంశాలు, సంక్షేమ పథకాలు తమకు అడ్వాంటేజ్ అవుతాయని, గ్రౌండ్ లెవెల్‌లో కేడర్ కూడా పూర్తి జోష్‌లో ఉందని కూటమి భావిస్తోంది.

మొత్తానికి ఒకవైపు ఎలాగైనా తమ ఉనికిని చాటుకోవాలని వైసీపీ(YCP), మరోవైపు వందశాతం స్ట్రైక్ రేట్‌తో అన్ని స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయాలని కూటమి పట్టుదలగా ఉండటంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ మున్సిపల్ సమరం ఏ రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది? ఎవరి వ్యూహాలు ఫలించనున్నాయి? అన్నది ఈ నెల 26న తేలనున్న పోలింగ్ ఫలితాలు నిర్ణయించనున్నాయి.

Tags
AP Municipal Elections 2026 Andhra Pradesh Ap Politics YSRCP TDP Janasena BJP AP Local Elections
Recent Comments
Leave a Comment

Related News