బొత్స ఆవేశం.. ఇలాగైతే క‌ష్ట‌మే.!

admin
Published by Admin — November 15, 2026 in Politics, Andhra
News Image

 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) పరాజయాల పరంపర, తాజాగా వెలువడిన స్థానిక సంస్థల ఫలితాల వరకు ఏమాత్రం ఆగలేదు. ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, పార్టీలో మాత్రం ఆత్మపరిశీలన లోపించిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే కోణంలో వైసీపీ సీనియర్ నేత, విజయనగరం ఇంచార్జ్ బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ లాంటి ఉద్దండ నేతకు కూడా ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి కీలకమైన బంధువు చిన్న శ్రీను(Chinna Srinu) హ్యాండ్ ఇవ్వడం, ఆ వెంటనే మరికొందరు నేతలు సైతం పార్టీ మార్చడం, చివరకు విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయంగా ఆయన కుమార్తె అనూష ఓటమి చవిచూడడం... ఇవన్నీ బొత్స వ్యక్తిగత ఇమేజ్‌కు, రాజకీయ ప్రస్థానానికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. కూటమి హవాలో విజయనగరం జిల్లా పూర్తిగా క్లీన్ స్వీప్ కావడం వైసీపీ శ్రేణులను నైతికంగా కుంగదీసింది.

ఈ నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ అంతర్గత సమావేశంలో బొత్స(Botsa Satyanarayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయింది. "ఇకపై అయ్యో పాపం అనే పద్ధతి ఉండదు, కక్షసాధింపు రాజకీయాలు చేసేవారికి భవిష్యత్తులో చుక్కలు చూపిస్తాం, అధినేత వైఎస్ జగన్‌కు కూడా ఇదే చెప్పాను" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయామన్న అసహనం, ప్రత్యర్థుల దూకుడును ఎదుర్కోలేకపోతున్నామన్న నిస్సహాయత ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించాయి.

అయితే, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ(YCP) ఘోర పరాజయానికి ప్రధాన కారణం పార్టీ నేతల అహంకారపూరిత ధోరణేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు తీర్పు ఇచ్చినా కూడా ఇంకా అదే పాత పద్ధతిలో "చుక్కలు చూపిస్తాం, రప్ప రప్ప చూస్తాం" అంటూ వార్నింగ్‌లు ఇవ్వడం ద్వారా పార్టీ మరింత బక్ ఫుట్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ప్రజల నాడిని అర్థం చేసుకుని, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాల్సింది పోయి, ఇలాంటి ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదు. ఒకవైపు జగన్(Jagan) 2.0 కోసం పార్టీ శ్రేణులు ఆశతో ఎదురుచూస్తుంటే, సీనియర్ నేతల ఇలాంటి రెచ్చగొట్టే ధోరణి ఆ పార్టీ భవిష్యత్తును మరింత ప్రశ్నార్థకం చేస్తోంది.

Tags
Botsa Satyanarayana YSRCP YS Jagan Ap Politics Andhra Pradesh Vizianagaram TDP JSP BJP
Recent Comments
Leave a Comment

Related News