తప్పులు అందరూ చేస్తారు. కానీ.. సమయం, సందర్భం .. ఎదురు తంతున్నప్పుడు.. మార్పుల దిశగా అడుగులు వేస్తారు. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ మొండి వైఖరి కారణంగా.. వ్యక్తిగతంగా ఆయనతోపాటు.. పార్టీని నమ్ముకున్న వారు కూడా పరాజితులు అవుతున్నారు. నవ్వుల పాలవుతున్నారు. స్థానిక ఎన్నికల సమరంలో సత్తా చాటుకుంటే తప్ప.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పుంజుకునే పరిస్థితి లేదన్న విషయాన్ని స్వయంగా చెప్పిన జగన్.. ఆ మేరకు తన వ్యూహాలను మలుచుకునే విషయంలో పెద్ద పెద్ద తప్పులు చేశారు తప్ప.. తప్పులు సరిచేసుకునే ప్రయత్నాలు చేయలేదు.
అసెంబ్లీ టికెట్ల వ్యవహారం..
స్థానిక ఎన్నికల సమయంలో అసెంబ్లీ టికెట్ల వ్యవహారాన్ని ప్రస్తావించడమే పెద్ద తప్పు గా వైసీపీ నాయకులు చెబు తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించి.. కూటమి ప్రభావాన్ని అంచనా వేసి.. నాయకులను ప్రోత్సహించా ల్సిన జగన్.. పూర్తిస్థాయిలో వారిపైనే భారం వేసి.. తాను తప్పుకొన్నట్టుగా వ్యవహరించారు. అంతేకాదు.. ఇదే సమయంలో ఏకగ్రీవాలు జరిగితే.. టికెట్ ఇవ్వనని తెగేసి చెప్పారు. దీంతో నాయకులు కట్టడిగా పనిచేస్తారని ఆయన ఆశించి ఉండొచ్చు. కానీ, ఇది రివర్స్ అయింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎదురొడ్డడం కంటే.. టికెట్ సంగతి అప్పుడు చూసుకోవచ్చులే.. అని నాయకులు చేతులు ఎత్తేశారు.
చెల్లితో పోరు..
గత 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన సోదరి షర్మిల ఆస్తులు, వివేకానందరెడ్డి హత్యను తెరమీదకు తెచ్చి యాగీ చేసిన విషయం తెలిసిందే. దీని నుంచి తప్పించుకునేందుకు జగన్ ప్రయత్నించలేదు. ఆ సమయంలో ఆయన మౌనంగా ఉన్నారు. మౌనమే తన సమాధానం అనుకున్నారు. దీంతో షర్మిల వాదనను ప్రజలు పెద్దగా పట్టించుకున్నా.. వైసీపీపై ప్రభావం చూపలేదు. కానీ, ఈ దఫా షర్మిల కుమార్తె వివాహానికి బెంగళూరు ప్యాలెస్ ఇవ్వడం లేదన్న షర్మిలవాదన విషయంలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
పోనీ.. ఇదేమన్నా.. అందరూ మెచ్చుకునేలా ఉందా? అంటే లేదు. తన భద్రత పేరుతో ఇవ్వడం లేదన్నారు. ఇది ప్రజలకు కూడా సిల్లీగా అనిపించింది. ప్రజల నాయకుడినని.. ప్రజల మధ్యే ఉంటానని చెప్పుకొనే జగన్ ఇలా భద్రత నెపంతో ఇవ్వడం లేదని స్వయంగా చెప్పడంతో ఆయనకు వ్యతిరేకత సహజంగానే పెరిగింది. ఇది కూడా ఆయన చేసిన మరో ప్రధాన తప్పుగా చెబుతున్నారు. అలా కాకుండా.. మౌనంగా ఉండి ఉంటే.. ప్రజలు కూడా పెద్దగా ఈ విషయాన్ని చర్చించుకునే అవకాశం ఉండేది కాదు.
క్షేత్రస్థాయి మానిటరింగ్
ఇక, స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని జగన్ పూర్తిస్థాయిలో జిల్లాల ఇంచార్జ్‌లకే బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో ఆయన బెంగళూరులో నే మకాం వేశారు. ఇది కూడా పార్టీలో చర్చకు దారితీసింది. ఒకవైపు తాము ఆపశోపాలు పడుతుంటే.. జగన్ తమకు అందుబాటులో లేకుండా పోయారని.. కనీసం తమను మానిటరింగ్ చేసే పరిస్థితి కూడా లేదని నాయకులు వాపోయారు. ఈ పరిణామాలు కూడా వైసీపీ పతనానికి కారణమయ్యాయి. మొత్తంగా జగన్ చేసిన అతి పెద్ద తప్పుల్లో ఈ మూడు ప్రభావం చూపించాయని అంటున్నారు.