వైసీపీ అధినేత జగన్.. తాజాగా బెంగళూరులో చికిత్స పొందుతున్న రాప్తాడు విద్యార్థిని గోపికను పరామర్శించారు. ఈ పర్యటనలోనూ ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను పెద్ద ఎత్తున తీసుకువెళ్లడం గమనార్హం. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో జై జగన్ నినాదాలు మిన్నంటాయి. ఒక్క పార్టీ జెండాలు మాత్రమే కనిపించలేదు. అనంతపురం జిల్లాకు చెందిన నాయకులు మొత్తం అక్కడే ఉన్నారు. మాజీ మంత్రి ఉష శ్రీచరణ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వంటి నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు.
ఆసుపత్రిలో బాలికను దూరం నుంచి చూసేందుకు మాత్రమే వైద్యులు అనుమతించారు. ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జగన్ కూడా దూరం నుంచి బాలికను చూసి బయటకు వచ్చారు. అనంతరం బాలి తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ పరిహారం కూటమి ప్రభుత్వం ఇవ్వక పోతే.. తాము అధికారంలోకి వచ్చాక ఇంతకు రెండింతలు ఇస్తామని హామీ ఇచ్చారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని జగన్ సూచించారు. వైద్యులతోనూ ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు. విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్నారని.. మ ద్యం బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అందుకే యువత పెడదోవ పట్టిందని చెప్పారు. ``ఒక పిల్లోడు రంపంతో స్కూల్లోకి వచ్చేంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది? అసలు మానిటరింగ్ చేస్తున్నారా?`` అని ప్రశ్నించారు. గంజాయి, మద్యానికి యువతను బానిసలు చేస్తున్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి, మద్యం నిత్యావసర సరుకులా మారిపోయిందని.. వీధి వీధిలోనూ అమ్ముతున్నారని విమర్శించారు. గంజాయి మత్తులోనే బాలికపై యువకుడు దాడికి పాల్పడ్డాడని విమర్శించారు.
మీ హయాంలోనే: టీడీపీ
కాగా.. జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలు మాట్లాడు తూ.. జగన్ హయాంలోనే యువతకు గంజాయి సంస్కృతి అలవడిందన్నారు. కూటమి వచ్చిన తర్వాత ఈగల్ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గంజాయి పై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. జగన్ మాదిరిగా రప్పా.. రప్పా బ్యాచ్‌ను ప్రోత్సహించే సంస్కృతి తమకు లేదన్నారు. ప్రభుత్వమే బాలికను ఆదుకుంటుందని.. జగన్ కేవలం దీనిని కూడా రాజకీయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నార ని దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరూ ఛీ కొడుతున్నా.. జగన్‌లో మార్పు రావడం లేదన్నారు.