ఇటీవల ఏపీలోని పలు జిల్లాలను వణికించిన ఆర్నబ్ తుఫాను కారణంగా.. తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. సుమారు 4600 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. అలానే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తోనూ మాట్లాడారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 9 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందాన్ని ఏపీకి పంపించింది. ఈ బృందం.. తుఫాను ప్రభావిత నాలుగు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించి నష్టం వివరాలను సేకరించింది. బాధితులతోనూ మాట్లాడింది. అనంతరం.. సోమవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో అమరావతిలో భేటీ అయింది.
ఈ సందర్భంగా తుఫాను వేళ సీఎం చంద్రబాబు చూపిన చొరవ, ప్రాణ నష్టం సంభవించకుండా ఆయన తీసుకున్న జాగ్రత్తలను కేంద్ర బృందం సభ్యులు ప్రశంసించారు. ``విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని మీ నుంచి నేర్చుకునేలా చేశారు. మీ పనితీరు భేష్. ఇతర రాష్ట్రాల్లోనూ దీనిని అమలు చేసేలా సిఫారసు చేస్తాం`` అని సభ్యులు పేర్కొన్నారు. ఆర్నబ్ తుఫాన్ నష్టంపై అంచనా కు ఇప్పటికే 4 జిల్లాల్లో పర్యటించామని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు. కోనసీమ, పశ్చిమగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో నష్టంపై అంచనా వేసినట్టు తెలిపారు. ప్రాథమిక నష్టం అంచనాలపై రాష్ట్రం సమర్పించిన నివేదికకు అనుగుణంగా తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందించేలా సిఫారసు చేస్తామన్నారు.
ఇక, ఆర్నబ్ తుఫాను కారణంగా రూ.4,526 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక నివేదికను రాష్ట్ర అధికారులు ఈ బృందానికి అందించా రు. ప్రాణ, ఆస్తినష్టం తగ్గించటంలో ఆర్టీజీఎస్, వాట్సప్ మనమిత్ర కీలకంగా వ్యవహరించాయని కేంద్ర బృందం సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ఇతర రాష్ట్రాలకూ సిఫార్సు చేస్తామని తెలిపారు. వివిధ జిల్లాల్లో అర్నబ్ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని దగ్గరి నుంచి పరిశీలించామని, వరి, కొబ్బరి, అరటి వంటి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్టు గుర్తించామని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు. ముఖ్యంగా పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ తీవ్రత వల్ల నష్టం మరింత పెరిగిందని వివరించారు.
ప్రాణ నష్టాన్ని తగ్గించటంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని వెల్లడించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావటంలో జిల్లా యంత్రాంగాలు శ్రమించాయని కొనియాడారు. ప్రత్యేకించి విద్యుత్, రహదారుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయటం అభినందనీయమని ప్రశంసించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం యుద్ధ ప్రాతిపదిక పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆయా అంశాలపై చంద్రబాబు స్పందిస్తూ.. సాంకేతికతను ఆధారంగా చేసుకుని తుఫానును ముందుగానే అంచనా వేశామన్నారు. అదేసమయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం ద్వారా.. ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం ద్వారా ప్రాణ నష్టం వాటిల్లకుండాచర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.