ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే కుప్పం నియోజకవర్గం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అంచనాలకు మించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా, దశాబ్దాలుగా టీడీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న కుప్పంలో సైకిల్ జోరు ఏ స్థాయిలో ఉందో ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.
కుప్పం(Kuppam) మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొత్తం 32 వార్డుల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జైత్రయాత్రను కొనసాగించారు. ఏ ఒక్క వార్డులోనూ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థులు ఒక్కరు కూడా తగ్గకుండా విజయం సాధించడంతో ఆ ప్రాంతంలో పసుపు శ్రేణులు అంబరాన్ని తాటేలా సంబరాలు చేసుకుంటున్నాయి. ఫలితాలు వెలువడిన క్షణం నుంచే బాణసంచా కాల్పులు, స్వీట్ల పంపిణీతో కుప్పం పట్టణం మార్మోగిపోయింది.
వైసీపీకి శరాఘాతంగా మారిన ఫలితాలు
మరోవైపు, అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పుకునే వైఎస్సార్‌సీపీ(YSRCP)కి ఈ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను, కోలుకోలేని దెబ్బను మిగిల్చాయి. ప్రత్యర్థి పార్టీని గట్టిగా ఎదుర్కొంటామని ప్రచారం చేసినా, క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం కనిపించలేదు. ఏకంగా మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క వార్డులో కూడా గెలుపొందలేకపోగా, కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.
ఈ భారీ విజయం కేవలం ఒక మున్సిపాలిటీ గెలుపు మాత్రమే కాదని, కుప్పంలో తమ పట్టు ఏమాత్రం సడలలేదని టీడీపీ(TDP) శ్రేణులు గట్టిగా చాటుతున్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న కూటమి పార్టీలకు కుప్పం ఫలితం మరింత జోష్‌నిచ్చింది. మరోవైపు, ఏపీ మున్సిపల్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి గాలి బలంగా వీస్తోంది. ప్రతి మున్సిపాలిటీల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయతీరం వైపు దుసుకెళ్తున్నారు. చివరకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పలు మున్సిపాలిటీల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది.