ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు సహా మంత్రులు కూడా చాలా బిజీగానే ఉన్నారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేప థ్యంలో వీటిలో విజయం దక్కించుకోవాలన్న కుతూహలం.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైనం నేపథ్యంలో ఎక్కువగా మంత్రులు, నాయకు లు ఈ విషయంపైనే దృష్టి పెట్టారు. దీనిని ఎవరూ కాదనరు. మరోవైపు ఆర్నబ్ తుఫానుతో పాటు మరోవైపు పొంచి ఉన్న మరో విపత్తుపై పూర్తిస్థాయిలో సీఎం చంద్రబాబు వాటిపైనే దృష్టి పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు కీలకమైన వ్యవహారాలు కట్టుతప్పుతున్నాయి. ఇవి ఇప్పుడు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా చేస్తున్నాయి.
తాజాగా వైసీపీ అదినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు. రాప్తాడులో జరిగిన విద్యార్థి ని ఘటనను ఆయనను ఉదహరించారు. అయితే.. ఇది ఎలా ఉన్నా.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలు ప్రభు త్వానికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఏర్పడింది. విశాఖపట్నంలో ఏకంగా 70 లక్షల రూపాయల నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. వీటిని ఏకంగా ఎన్నికల సమయంలో పంచేందుకు ఓ పార్టీ నేత రెడీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ నేతలపై విమర్శలు రావడం గమనార్హం. ఈ వ్యవహారం ఉత్తరాంధ్రతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
మరోవైపు కర్నూలు, కడప జిల్లాల్లో బాంబులు, నాటు తుపాకులనుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో ఏకంగా 432 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నకిలీ మద్యం బాటిళ్లను భారీ ఎత్తున గుంటూరులో స్వాధీనం చేసుకున్నారు. సరే.. ఇవన్నీ ఎన్నికల సమయంలో కామనేనని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. వీటి మూలాలు ముఖ్యం. నకిలీ నోట్లను చలామణి లోకి తీసుకువచ్చేందుకు ఎన్నికల సందర్భాన్ని వాడుకున్నారన్నది అంగీకరించవచ్చు. కానీ, అసలు వీటి తయారీ ఎప్పటి నుంచో జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. దీనిపై దృష్టి పెట్టాలి.
ఇక, గంజాయిని, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కోటిన్నర రూపాయలవిలువ చేసే గంజాయి ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఇవన్నీ.. కొందరు నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారుపై వచ్చే విమర్శలకు చెక్ పెట్టాలంటే ఇలాంటి వాటిపైనా ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఈ నేరాలను కట్టడి చేసేందుకు మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎంత బిజీ అయినా.. ఈ వ్యవహారాలు జాతీయస్థాయిలో రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందని అంటున్నారు.