బాబుపైనే తిరుగుబాటు.. ఈసారి కొలికపూడిపై వేటు ఖాయమా.?

admin
Published by Admin — October 17, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటూనే ఉంటుంది. తాజాగా అధికార కూటమిలో చెలరేగిన అంతర్గత పోరు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తిరువూరు రాజకీయం ఇప్పుడు పరాకాష్టకు చేరింది. పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని లెక్కచేయకుండా, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాటే కాదంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగానే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఈ పరిణామం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి కూటమి మధ్య సఖ్యత చాలా కీలకం. కానీ, తిరువూరు(Tiruvuru) నగర పంచాయతీ ఛైర్మన్ పీఠం కేటాయింపు వ్యవహారం ఇరు పార్టీల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. వ్యూహాత్మకంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటు జనసేన కూడా అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారానికి సిద్ధమైంది. సరిగ్గా ఇక్కడే అసలు సినిమా మొదలైంది. జనసేనకు సీటు ఇవ్వడాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్రంగా వ్యతిరేకించారు. అధినేత నిర్ణయాన్ని శిరసావహించాల్సిన ప్రజాప్రతినిథే స్వయంగా రంగంలోకి దిగి, తన వర్గం నుండి మరో మహిళా నేత పెనుబల్లి శ్రావణిని బరిలోకి దించుతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా శ్రావణి నామినేషన్ ర్యాలీ పోస్టర్లను స్వయంగా షేర్ చేయడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. "అందరూ ఆహ్వానితులే" అంటూ ఆయన వేసిన ఈ ఎత్తుగడ.. అధిష్టానానికి నేరుగా సవాల్ విసిరినట్టే ఉందనే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పార్టీలోని ఇతర ముఖ్య నేతలతో ఉన్న విభేదాలు ఒకెత్తయితే, ఇప్పుడు ఏకంగా కూటమి సమన్వయానికే తూట్లు పొడిచేలా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(MLA Kolikapudi Srinivas Rao) వ్యవహరించడం పట్ల పార్టీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణ విషయంలో ఎప్పుడూ కఠినంగా ఉండే చంద్రబాబు, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు, సొంత పార్టీ నేతలతో విబేధాల కారణంగా హెచ్చరికలు ఎదుర్కొన్న కొలికపూడి శ్రీనివాసరావు.. ఈసారి మాత్రం హద్దు మీరారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ధర్మాన్ని కాలరాస్తూ, ప్రత్యక్షంగా పార్టీ అధినాయకత్వానికే ఎదురుతిరిగిన ఈ ఎమ్మెల్యేపై అధిష్టానం వేటు వేయడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఈ తిరుగుబాటు ఎక్కడికి దారితీస్తుంది? చంద్రబాబు(Chandrababu) ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Tags
Tiruvuru Politics Andhra Pradesh TDP Chandrababu Naidu Kolikapudi Srinivas AP Municipal Elections JanaSena
Recent Comments
Leave a Comment

Related News