ఏపీలో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల పర్వం!

admin
Published by Admin — October 18, 2026 in Andhra
News Image

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి నామినేష‌న్ల ఘ‌ట్టం ప్రారంభ‌మైన శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగాయి. పుంగ‌నూరు, రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ, కూట‌మి పార్టీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు ప‌క్క‌న పెడితే.. ఇత‌ర రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల సొంత పార్టీల నాయ‌కుల మ‌ధ్యే వాడి వేడి రాజ‌కీయాలు చోటు చేసుకున్నాయి. అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌కుండానే చాలా చోట్ల టీడీపీ నాయ‌కులు నామినేష‌న్లు వేసేశారు. ఇక‌, త‌మ‌కు ద‌క్కుతుంద‌ని భావించిన మునిసిపాలిటీని జ‌న‌సేన‌కు ఇవ్వ‌డంతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి భారీ సెగ త‌గిలింది. కార్య‌క‌ర్త‌ల వ్య‌వ‌హారంతో ఆమె క‌న్నీరు పెట్టుకున్నారు.

అలానే.. వైసీపీలోనూ త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎంపీ బుట్టా రేణుక నిప్పులు చెరిగారు. త‌మ వ‌ర్గానికి క‌నీసం ప‌ట్టుమ‌ని ప‌ది స్థానాలు కూడా ఇవ్వ‌లేద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలానే.. ప‌లు చోట్ల పోటా పోటీగా వైసీపీ-టీడీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌డంతో ఘ‌ర్ష‌ణ‌లు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తంగా స్థానిక ఎన్నిక‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ తొలిరోజు చిత్ర విచిత్రాల‌తోపాటు.. ఘ‌ర్ష‌ణ‌లు, దాడులు కామ‌న్ అయిపోయాయి. దీంతో ఎన్నిక‌ల సంఘం మ‌రింత ప‌క్కా ఏర్పాట్లు, భ‌ద్ర‌త క‌ల్పించే దిశ‌గా అడుగులు వేసింది.

విజ‌య‌వాడ‌లో..

విజ‌య‌వాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు తేలకముందే టీడీపీ నాయ‌కులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్ర‌వారం 19 మంది నాయ‌కులు వివిధ వార్డుల‌కు సంబంధించి నామినేషన్లు వేసేశారు. అలాగే మ‌రికొంద‌రు బీజేపీ, జ‌న‌సేన నేత‌లు కూడా త‌మ‌కు టికెట్లు, సీట్లు ఖ‌రారు కాకుండానే నామినేష‌న్లు దాఖలు చేయడంతో కూటమిలో రాజ‌కీయం వేడెక్కింది. అతేకాదు.. నామినేష‌న్ వేసిన వారు కూడా.. త‌మ‌కు సీటు ఖరారు కాకపోతే.. ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతామ‌ని తేల్చి చెప్పారు. అయితే.. ఈ వ్య‌వ‌హారాన్ని అటు టీడీపీ, ఇటు జ‌న‌సేన‌లు తీవ్రంగా భావిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. నామినేష‌న్లు వేసిన వారు వెన‌క్కి త‌గ్గ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

మంత్రి క‌న్నీరు!

పార్వతీపురం జిల్లాకు చెందిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. క‌న్నీరు పెట్టుకున్నారు. సాలూరు మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకు కేటాయించడంపై ఆమె అనుచ‌రులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ప‌ట్టుమ‌ని రెండు శాతం ఓట్లు కూడా లేని జనసేన పార్టీకి మున్సిపల్ చైర్మన్ సీటు కేటాయించడం ఏంట‌ని మంత్రిని నిల‌దీశారు. దీంతో ఆమె క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో మంత్రి సంధ్యారాణిని, టీడీపీ శ్రేణులను మ‌రో మంత్రి అచ్చెన్నాయుడు బుజ్జ‌గించారు. అధిష్టానం నిర్ణ‌యాన్ని గౌర‌వించాల‌ని కోరారు.

వైసీపీలోనూ మంట‌లే!

కర్నూలు జిల్లా వైసీపీలోనూ స్థానిక ఎన్నిక‌ల మంట‌లు రాజుకున్నాయి. ఎమ్మిగనూరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ వ‌ర్గానికి సీట్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎంపీ బుట్టా రేణుక వర్గం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. రెబెల్స్‌గా పోటీకి సిద్ధమ‌వుతున్న‌ట్టు ఆమె వ‌ర్గం ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో వైసీపీ నేత‌.. రాజీవ్‌రెడ్డి ఏకపక్ష వైఖరిపై బుట్టా రేణుక ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

క‌డ‌ప‌లో ..

కడప కార్పొరేషన్ లో తొలి రోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే.. వీటిలో వైసీపీ నుంచి అవ‌కాశం ద‌క్కించుకున్న‌ ఏడుగురు ఉండ‌గా.. ఇంకా సీట్లు ఖ‌రారు కాకుండానే నామినేష‌న్లు వేసిన టీడీపీ నేత‌లు ఇద్ద‌రు ఉన్నారు. ధర్మవరం మున్సిపాలిటీలో తొలిరోజు 63 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో టీడీపీ నుంచి 14 మంది, వైసీపీ నుంచి 47 మంది, ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్క‌డ కూడా టీడీపీ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేకుండానే 14 మంది నామినేష‌న్ వేసేయ‌డం గ‌మ‌నార్హం. 

Tags
Municipal poles nominations in AP finished today
Recent Comments
Leave a Comment

Related News