వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ సాయిరెడ్డి మరోసారి ఆ పార్టీ ఆధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ‘రెడ్డి’ ట్యాగ్ అడ్డుపెట్టుకొని హిందువులను, క్రిస్టియన్ అని క్రైస్తవులను, సెక్యులర్ అని ముస్లింలను మోసం చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. క్రిస్టియానిటీని వీడి జగన్ రెడ్డిగా హిందువులలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఆలయాలకు వెళ్లినప్పుడు అర్చకులు తీర్థం ఇస్తే కొందరు తాగినట్లు నటిస్తారని, వేళ్ల సందుల్లోంచి కిందకు వదిలేస్తారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రసాదం కూడా తర్వాత తింటామని పక్కన పెడతారని చెప్పారు. వారు పాటించే సెక్యులరిజం ఇదని విమర్శించారు. తాను స్వచ్ఛమైన హిందువునని, ఇతర మతాల ప్రార్థనా స్థలాలకు కూడా వెళతానని అన్నారు. టీడీపీ కూటమి, వైసీపీ తర్వాత తమ పార్టీ మూడో ప్రధాన శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిలబడుతూ, ప్రభుత్వం, ప్రతిపక్షంపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తామని అన్నారు.