ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రధాన ప్రతిపక్షం వైసీపీ(YCP)కి వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సైతం గ్లాస్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు కోలగట్ల వీరభద్రస్వామి(Kolagatla Veerabhadra Swamy) పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన తన అనుచరులు, సన్నిహితులైన ద్వితీయ శ్రేణి నాయకులతో వేర్వేరుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా తిరుగులేని పట్టు కలిగి ఉన్న కోలగట్ల, అధికార కూటమి వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం ప్రాంతాలకు చెందిన జనసేన(Janasena) ముఖ్య నేతలతో కోలగట్ల రహస్యంగా మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. నియోజకవర్గంలోనూ, జిల్లా స్థాయిలోనూ ఆయన వర్గానికి చెందిన నేతలు ఇప్పటికే జనసేన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలో కోలగట్ల అధికారికంగా జనసేన కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖరారైపోయిందని, త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి.
కేవలం పార్టీ మారడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా జనసేన అధిష్టానంతో ఆయన కొన్ని కీలక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కూడా ఉమ్మడి విజయనగరం(Vizianagaram) జిల్లాలో చక్రం తిప్పిన కోలగట్ల వీరభద్రస్వామి వంటి సీనియర్ నేత నిజంగా జనసేనలోకి వెళితే, అది కచ్చితంగా వైసీపీకి కోలుకోలేని దెబ్బే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ భారీ చేరికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో, ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో ఈ పరిణామం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.