ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఏపీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 34 శాతం రిజర్వేషన్ కల్పించింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే, 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదంటూ ఏపీ హైకోర్టు ఆ రిజర్వేషన్ల జీవోను కొట్టిపారేసింది. ఈ క్రమంలోనే ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మరోవైపు, ఈసారి ఎన్నికలు బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతాయా లేక ఈవీఎంల ద్వారా జరుగుతాయా అన్న ఉత్కంఠ ఏర్పడింది. అయితే, ఆ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. అంతేకాదు, ఈ సారి బ్యాలెట్ పేపర్ల విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరి 5 నాటికి అంటే ఎస్ ఐఆర్ జరగడానికి ముందు ఉన్న ఫొటో ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆల్రెడీ బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని, రెండు నెలలుగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు.