విమానాశ్రయాలకు చరిత్రకారుల, ప్రముఖుల పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఇటీవల భోగాపురంలో ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఏపీ ప్రభుత్వం పెట్టింది. తాజాగా అదే బాటలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పయనిస్తున్నారు. వరంగల్ ఎయిర్పోర్టుకు మంచి పేరు సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులను కోరారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి పిలుపునకు టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు.
వరంగల్లో పుట్టి పెరిగిన సందీప్ రెడ్డి వంగా రుద్రమ అంతర్జాతీయ విమానాశ్రయం(RIA), కాకతీయ అంతర్జాతీయ విమానాశ్రయం(KIA) అనే పేర్లను ప్రతిపాదించారు. తన సొంత గడ్డ వరంగల్ లో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతూ ఉండడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వరంగల్ వాసుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోందని, అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నానని సందీప్ రెడ్డి వంగా అన్నారు. ఈ పేరును నిర్మాత దిల్ రాజు స్వాగతించారు. ఇక, ఈ విమానాశ్రయానికి సమ్మక్క సారలమ్మ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిపాదించారు. రాణి రుద్రమదేవి అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మరో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ప్రతిపాదించారు.