థియేటర్లలో ఇరగాడేస్తుండగా.. ఓటీటీలోకి?

admin
Published by Admin — September 14, 2026 in Movies
News Image

ఈ వీకెండ్లో ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాాయి. కానీ వాటిలో ఏ సినిమా కూడా 20 రోజుల ముందు రిలీజైన ‘ఇరుముడి’ సినిమాను బీట్ చేయలేని పరిస్థితి. ప్రస్తుతం నాలుగో వీకెండ్లో ఉన్న ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కొత్త సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి మంచి ఆక్యుపెన్సీలతో రన్ అవుతోంది. ఒక్క ‘మండాడి’ మాత్రమే ‘ఇరుముడి’కి పోటీ ఇస్తోంది. 

రాబోయే వారాంతంలో కూడా పెద్ద రిలీజ్‌లు ఏమీ లేవు. ఈ నెల 23న రాత్రి ‘ది ప్యారడైజ్’ ప్రిమియర్స్ పడే వరకు ‘ఇరుముడి’కి ఎదురుండదనే భావిస్తున్నారు. ఇంకో పది రోజులు ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఐతే ఇంత బాగా ఆడుతున్న సినిమా.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ నెల 18, శుక్రవారం నాడు ‘ఇరుముడి’ డిజిటల్‌గా రిలీజవుతోంది.

‘ఇరుముడి’ ఎక్స్‌టెండెడ్ రన్ చూసి.. ముందు చేసుకున్న డిజిటల్ డీల్‌ను రివైజ్ చేస్తారేమో అన్న చర్చ జరిగింది. గతంలో కొన్ని సినిమాలకు ఇలా చేసిన సందర్భాలున్నాయి. కానీ మైత్రి సంస్థ ఆ దిశగా ప్రయత్నాలు చేసిందో లేదో కానీ.. ‘ఇరుముడి’ ముందు అనుకున్నట్లే థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ ఫ్లాట్‌ఫామ్‌లో రాబోయే శుక్రవారం నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయబోతున్నట్లు లీడ్ కూడా ఇచ్చేసింది. 

ఐతే థియేటర్లలో బాగా ఆడుతున్న సినిమాను అప్పుడే ఓటీటీలోకి తెచ్చేయడం కరెక్టేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకో వారం ఆలస్యం చేయగలిగి ఉంటే.. ఐదో వీకెండ్లో కూడా ఈ సినిమా మంచి షేర్ రాబట్టేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’లో రవితేజ, ప్రియభవానీ శంకర్, నక్షత్ర, సాయికుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఇప్పటికే రూ.25 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Tags
Irumudi's Ott release date fix amid it's successful theatrical run
Recent Comments
Leave a Comment

Related News