దసరా(Dasara 2026) పండుగ వస్తోందంటే చాలు, బాక్సాఫీస్ వద్ద సినిమాల యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈసారి పండగ రేసు మరింత రంజుగా మారబోతోంది. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇద్దరు క్రేజీ హీరోలు ఒకే సీజన్‌ను టార్గెట్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఒక వైపు బాక్సాఫీస్ రారాజుగా దశాబ్దాలుగా తన మార్క్ చూపిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కాగా, మరో వైపు కుర్రకారును ఉర్రూతలూగించే విజయ్ దేవరకొండ బరిలో నిలవడం ఈ క్లాష్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చింది.
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), క్రియేటివ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'జైలర్ 2' అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ధీమాగా ఉన్నారు. గత చిత్రానికి మించి ఈ సీక్వెల్ ఉండబోతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా స్టార్ట్ కాకపోవడం, బిజినెస్ డీల్స్ విషయంలో బయ్యర్లతో చిన్నపాటి సందిగ్ధత నడుస్తుండటంతో కొంత టెన్షన్ అయితే నెలకొంది. ఏ చిన్న పొరపాటు జరిగినా సినిమా వాయిదా పడుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, సన్ పిక్చర్స్ మాత్రం పగలు అనక రాత్రి అనక శ్రమిస్తూ, అనుకున్న టైమ్‌కే సినిమాను దించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది.
ఇక దీనికి సరిగ్గా ఇరవై నాలుగు గంటల గ్యాప్‌లోనే, అంటే అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) 'రణబాలి' సినిమాతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాపై జనాల్లో ఎక్స్‌పెక్టేషన్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టిస్తోంది. విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా దాదాపు కొలిక్కి రావడంతో, అక్టోబర్ మొదటి వారానికల్లా సెన్సార్ పనులు పూర్తి చేసి నాన్‌స్టాప్ ప్రమోషన్లకు దిగాలని విజయ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
ఇది ఒకరకంగా సీనియర్ వర్సెస్ జూనియర్ బాక్సాఫీస్ సమరంలా కనిపిస్తున్నప్పటికీ, అసలు విజయం దేనిని వరిస్తుందనేది పూర్తిగా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. 'జైలర్ 2(Jailer 2)'కి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ క్రేజ్, సీక్వెల్ బజ్ తోడుగా ఉన్నాయి. మరోవైపు 'రణబాలి' కోసం విజయ్ దేవరకొండ సరికొత్త గెటప్‌లో కనిపించనుండటం, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ టేకింగ్‌పై నమ్మకం సినిమాకు ప్రధాన బలంగా మారాయి. మరి ఈ రెండు భారీ చిత్రాల పోరులో ఏ సినిమా దసరా బరిలో నిలిచి బాక్సాఫీస్‌ను ఏలుతుందో చూడాలి.