తాజాగా జరిగిన ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి రిజల్ట్ వచ్చేసింది. బ్యాలెట్ పై జరిగిన ఈ ఎన్నికల్లో తుది ఫలితాలు వచ్చేందుకు సమయం ఎక్కువగానే తీసుకున్నా.. వాస్తవాలు వెలుగు చూశాయి. మొత్తం గా ఈ ఫలితాలు కూటమి పార్టీలకు జోష్ ఇవ్వగా.. వైసీపీకి మాత్రం ఎనలేని ఆవేదనను మిగిల్చాయనే చెప్పాలి. ఎందుకంటే.. ఈవీఎంలతో పోలింగ్ నిర్వహిస్తే.. తమ ఓటమి ఖాయమని ముందుగానే అంచనా వేసుకున్న వైసీపీ బ్యాలెట్ కోసం పట్టుబట్టింది. దీంతో యాదృచ్ఛికంగానే బ్యాలెట్ పైనే ఓట్లు పడ్డాయి.
అయినా వైసీపీ పుంజుకోలేక పోయింది. బలమైన పోటీ ఇచ్చామని అనుకున్నా.. సంఖ్యాపరంగా చూసుకుంటే కూటమి ముందు వైసీపీ ఓడిపోయింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో మరో కీలక విషయం.. వైసీపీకి గెలిచే నాయకులు లేక పోవడం కూడా స్పష్టం అయింది. కూటమి పార్టీల తరఫున జరిగిన కసరత్తు.. ప్రజల అభిప్రాయా లకు ఇచ్చిన విలువ ముందు.. వైసీపీ ఎలాంటి కసరత్తు చేయకుండానే వేసిన అడుగులు విఫలమయ్యాయి. పూర్తిగా జిల్లాల ఇంచార్జ్లపైనే వైసీపీ ఆధారపడిన తీరు కూడా పార్టీకి నష్టం తెచ్చిందన్న అభిప్రాయం ఉంది.
అభ్యర్థుల ఎంపిక విషయంలో కూటమి పార్టీలు చక్కని ప్రణాళికతో ముందుకు సాగాయి. ఫలితంగా కొంత సమ యం తీసుకున్నా.. ఆలస్యంగా అభ్యర్థులను ఎంపిక చేసుకున్నా.. ప్రతి చోటా టికెట్ దక్కించుకున్న నాయకులు విజయం దక్కించుకున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి కీలక కార్పొరేషన్లలో కూటమి తరఫున బరిలోకి దిగిన అందరూ విజయం దక్కించుకున్నారు. ఒకరిద్దరు మినహా అందరూ పాసయ్యారు. అంటే.. అభ్యర్థుల ఎంపిక కోసం చేసిన కసరత్తు పూర్తిగా ఫలించింది.
వైసీపీ విషయానికి వస్తే.. ఈ తరహా కసరత్తు పెద్దగా ఫలించలేదు. అసలు కసరత్తు చేయకుండానే జిల్లాల మాజీ మంత్రులు, మాజీ నాయకులకు బాధ్యతలు అప్పగించి వైసీపీ అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. అదేసమయంలో అసంతృప్తులను బుజ్జగించగలేక పోవడం కూడా.. పార్టీకి మైనస్ అయింది. విశాఖలో ఓడిపోయిన వారిని చూస్తే.. 50-100 లోపు ఓట్ల తేడాతోనే ఉన్నారు. అంటే.. అక్కడ వైసీపీ కొంత కసరత్తు చేసి ఉంటే.. కొంచెమైనా ప్రభావం చూపించే వారు. సో.. మొత్తంగా గెలుపు గుర్రాలను ఎంచుకోవడంలోనే వైసీపీ తప్పటడుగులు స్పష్టంగా కనిపించాయి. మరి అసెంబ్లీ ఎన్నికల నాటికైనా ఈ పరిస్థితి మారుతుందా ? లేదా ? అనేది చూడాలి.