వైసీపీ స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడానికి అనేక కారణాలు ఉన్నా.. కీలకమైన మరోకారణం పార్టీలోను.. జనాల్లోనూ చర్చకు వచ్చింది. ఎన్నికలు అనగానే.. ఒకప్పటి మాటేమో.. కానీ, ప్రస్తుతం సామాన్య ప్రజలు అంతో ఇంతో ఆర్థికాన్ని ఆశిస్తున్నారు. ఇది సర్వసాధరణం అయిపోయింది. ఈ క్రమంలో అన్ని పార్టీలూ... ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు తమ వైపు తిప్పుకొనేందుకు సొమ్ములు ఖర్చు చేస్తున్నాయి. అంతేకాదు.. పార్టీ ఫండ్ నుంచి కొంత మొత్తాన్ని కూడా కేటాయిస్తున్నాయి.
పార్టీ ఇచ్చే కొంత మొత్తానికి పోటీలో ఉన్న అభ్యర్థులు మరికొంత కలిపి క్షేత్రస్థాయిలో ఖర్చు చేయడం ద్వారా ఓట ర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తారన్నది.. పార్టీల అంచనా. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లోనూ వైసీపీ తమకు ఎదురు దెబ్బతగులుతుందని ముందుగానే అంచనా వేసుకున్న మునిసిపాలిటీలకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు కొంత మేరకు ఫండ్ రిలీజ్ చేసింది. ఈ నిధులకు తోడు అభ్యర్థులు కూడా కొంత కలిపి ఖర్చు చేయాలని నిర్దేశించినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు.
అయితే.. ఈ నిధులను ఖర్చు చేసే విషయంలో ఇంచార్జ్‌లుగా ఉన్న నాయకులు సరిగా వ్యవహరించలేదని నాయకులు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు అప్పులు చేసి ఖర్చు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల రూపాయి కూడా విదిలించకుండానే ముందుకు సాగారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక, పార్టీ సొమ్ములు ఇచ్చినా.. ఇంచార్జ్‌లు వాటిని ఖర్చు చేయకపోగా.. సొంతానికి వాడేసుకున్నారన్న విమర్శలు కూడా వైసీపీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలకు తాము దూరమయ్యామని చెబుతున్నారు.
ఉదాహరణకు విజయవాడ, గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో నాయకులు.. రోడ్డెక్కారు. ‘పార్టీ ఇచ్చిన ఎన్నికల ఫండ్‌లో ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా మమ్మల్ని పోటీ చేయమని, ఇస్తాలే అంటూ డబ్బులు ఇవ్వకుండా గాలికి వదిలేశావు.. నీ వల్లే వైసీపీ కంచుకోటల్లోనూ ఓడిపోయింది`` అంటూ.. జిల్లాల ఇంచార్జ్‌లుగా ఉన్న పలువురు నాయకులపై వైసీపీ నేతలు నిప్పులు చెరగడం కనిపించింది. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా నేతలు.. తమ ఖర్చులకు వాడేసుకున్నారన్నది నాయకులు చెబుతున్నమాట. మరి దీనిపై వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.