ఏపీలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కడపలో పులివెందులతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పులివెందులలో పలు చోట్ల వైసీపీ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ జరుగుతోందని, కొన్ని చోట్ల వైసీపీ అనుకూల ఓటర్లను అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ 70 మంది పోలింగ్ ఏజెంట్లతో కలిసి పులివెందుల ఆర్వో కార్యాలయం ముందు నేలపై కూర్చొని ధర్నాకు దిగిన వైనం చర్చనీయాంశమైంది.
అంతకుముందు రిటర్నింగ్ అధికారులతో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పిలుపు ఇచ్చి ఉంటే ఈ రోజు పోలింగ్ జరిగేది కాదని జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఒక్క మాట చెబితే తన వాళ్లు కూడా కొడతారు, తిడతారు, గొడవలు, కొట్లాటలకు దిగుతారని, కానీ, తాను అలా చేయదలుచుకోలేదని చెప్పారు. ప్రజాస్వామ్యంపై తనకు నమ్మకముందని, అందుకే సైలెంట్ గా ఉన్నామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని తాను గౌరవిస్తానని, తానే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజలకు ఏం సందేశం ఇస్తానని చెప్పారు. కానీ, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే అధికారులు కూడా సహకరిస్తూ చోద్యం చూడడం న్యాయమా అని జగన్ ప్రశ్నించారు.
అధికారులు తమ మనస్సాక్షిని అడగాలని, ఇది తప్పు అని అధికారులకు కూడా తెలుసని జగన్ అన్నారు. తాను అందుకే, కేవలం వైసీపీ ఏజెంట్లను మాత్రమే తీసుకుని వచ్చానని పులివెందుల ఆర్వోతో జగన్ చెప్పారు. కొన్ని చోట్ల బూత్ క్యాప్చర్ చేశారని ఆరోపించారు. అన్యాయం జరుగుతోందని అధికారులకు తెలిసినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని జగన్ ప్రశ్నించారు. తాము ఇన్ని ఆధారాలతో అన్యాయం జరుగుతోందని చెబుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం సరికాదని హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలా జరిగితే రాష్ట్రంలోని మిగతా చోట్ల ఎంత దారుణంగా పోలింగ్ జరుగుతోందో అర్థం చేసుకోవాలని చెప్పారు.