అనంతరపురం జిల్లా రాప్తాడు(Raptadu) ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పదో తరగతి విద్యార్థినిపై రంపంతో పాశవికంగా దాడికి తెగబడిన ఉన్మాది హేమంత్ ఉదంతం ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిల్చింది. అయితే, ఈ కేసులో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ తర్వాత కథ పూర్తిగా మలుపు తిరిగింది. ఉన్మాది రెండు కాళ్లలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లడంతో ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది.
ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని పోలీసులు భారీ భద్రత నడుమ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు. ప్రస్తుతం అతడిని నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్పృహలోకి వచ్చిన హేమంత్(Hemanth) ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పటికీ, అతడి శరీరంలోని గాయాలు మాత్రం వైద్యులకు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా కుడికాలు పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
రక్తప్రసరణ నిలిచిపోతే కాలు కట్ చేయాల్సిందేనా?
బుల్లెట్లు దూసుకెళ్లిన తీవ్రతకు కుడికాలులోని నరాలు, కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆ భాగానికి రక్తసరఫరా బాగా తగ్గిపోయిందని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి(Dr. Malliswari) తెలిపారు. శరీర భాగాలకు సమర్థవంతంగా రక్తం అందకపోతే కణజాలం చనిపోయి కాలును శాశ్వతంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఉన్మాది హేమంత్ ఒక కాలును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
ప్రస్తుతం ఆర్థోపెడిక్, న్యూరాలజీ, అనస్తీషియా విభాగాల నిపుణుల బృందం అతడి ఆరోగ్య నివేదికలను, ఎక్స్-రేలను అత్యంత సమగ్రంగా పరిశీలిస్తోంది. అత్యవసరంగా శస్త్రచికిత్స (Surgery) నిర్వహించి, డ్యామేజ్ అయిన నరాలను పునరుద్ధరించేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స పూర్తి అయిన తర్వాతే అతడి కాలును కాపాడగలరా? లేక తొలగించక తప్పదా? అనే అంశంపై పూర్తి స్పష్టత రానుంది.