ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని.. కన్నీరు పెట్టించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని.. వీటిని ఉక్కుపాదంతో అణిచేస్తామని ఆయన ప్రకటించారు. ఇక, సీఎం చంద్రబాబు సైతం ఈఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని.. కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
ఏం జరిగింది?
రాప్తాడు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల శనివారం కూడా యధావిధిగా ప్రారంభమైంది. పదోతరగతి విద్యార్థు లు అప్పుడే స్కూల్లోకి వచ్చి.. పాఠాలు వినేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇంతలో ఎలా వచ్చాడో.. ఎటు నుంచి వచ్చాడో తెలియదు కానీ.. ఓ యువకుడు తరగతి గదిలోకి ప్రవేశించాడు. తాను ఒక్కడే కాకుండా.. తన చేతిలో ఎలక్ట్రికల్ రంపపు బ్లేడుతో చొరబడ్డాడు. వచ్చీ రాగానే.. ఓ బాలికపై దానిని ప్రయోగించే పనిచేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అత్యంత పదునైన రంపం బ్లేడు మొహాన్ని.. ఛాతీని కూడా చెక్కేసింది. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ.. ఆ బాలిక పడిపోయింది.
ఈ ఘటన నుంచి బాధితురాలిని కాపాడే ప్రయత్నం చేసిన మరో ఇద్దరు బాలికలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. అనంతరం.. సదరు ఉన్మాద యువకుడు.. అక్కడ నుంచి పారిపోయాడు. అనంతరం.. బాధిత బాలికను విద్యార్థు లు, ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా దావాలనంగా వ్యాపించింది. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఫోన్ చేశారు. ఆమె ద్వారా బాధిత బాలిక కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. ధైర్యం చెప్పారు.
లోకేష్ ఆగ్రహం..
ఉన్మాది వ్యవహరించిన తీరుపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్మాదిని తక్షణమే పట్టుకోవాలని.. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్నారు. ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని సూచించారు. మహిళలు, బాలికల విషయంలో ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తుం దని చెప్పారు.
ఎందుకు జరిగింది?
ప్రాథమిక సమాచారం మేరకు.. ఉన్మాదిగా వ్యవహరించిన వ్యక్తి.. 20 ఏళ్ల వయసు వాడని.. బాలికను అతను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నట్టుగా చెబుతున్నాడని ఇతర విద్యార్థినులు తెలిపారు.తరచుగా స్కూల్కు కూడా వచ్చేవాడని.. కానీ, ఇంతలోనే ఇంత ఘోరానికి పాల్పడతాడని ఊహించలేదని అంటున్నారు. అయితే.. దీనిపై బాలిక కుటుంబం మౌనంగా ఉంది. తమ కుమార్తెకు చదువుకోవాలని ఉందని.. ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేయాలని ఉందని చెబుతున్నారు.