మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కలయికలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ మీద మొదట్లో ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ రిలీజ్ టైంకి హైప్ కొంచెం తగ్గింది. అయినా మెగా అభిమానులు ఎన్నో ఆశలతో సినిమాకు వెళ్లారు. తీవ్ర నిరాశతో బయటికి వచ్చారు. ఈ సినిమాకు కథ అందించింది విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అన్న సంగతి తెలిసిందే. తన నుంచి ఇలాంటి సగటు కథను ప్రేక్షకులు ఊహించలేదు. ట్రీట్మెంట్ కూడా రొటీన్‌గా అనిపించింది. ఐతే కార్తీక్ రాసింది థియేటర్లో మనం చూసిన కథ కాదట. స్క్రీన్ ప్లేలో అతడి జోక్యమే లేదట. తన ట్రీట్మెంట్ పూర్తిగా వేరని అతను తాజాగా ఒక కార్యక్రమంలో వెల్లడించాడు.
ఒక సివిల్ సర్వెంట్ ఎలక్షన్ డ్యూటీలో భాగంగా ఒక ఊరికి వెళ్లడం.. అక్కడ మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నించడం.. ఈ క్రమంలో రియాలిటీకి దగ్గరగా ఈ కథ నడుస్తుందని కార్తీక్ సుబ్బరాజ్ చెప్పాడు. ఈ కథ నడిచే విధానం గురించి చెబుతూ.. బాలీవుడ్ క్లాసిక్ ‘న్యూటన్’ను ఉదాహరణగా చూపించాడు కార్తీక్. అలాగే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో హీరో గ్యాంగ్ స్టర్ అని.. మధురై నుంచి వచ్చే వ్యక్తిగా అతడి పాత్రను రాశానని కార్తీక్ తెలిపాడు.
ఐతే శంకర్‌కు ఈ కథ చెప్పినపుడు, స్క్రీన్ ప్లే కూడా రాయమన్నాడని.. కానీ తాను అప్పటికి ‘మహాన్’ సినిమా పనిలో బిజీగా ఉండడం వల్ల ఆ పని చేయలేకపోయానని చెప్పాడు కార్తీక్. తాను తమిళంలో మిడ్ రేంజ్ హీరోతో ఈ సినిమా చేయాలనే ఉద్దేశంతో కథ రాశానని.. ఐతే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ ఈ సినిమా చేయడంతో ఆ లైన్‌ను భారీ స్థాయికి విస్తరించారని.. ఆ విషయంలో తాను సంతోషించానని కార్తీక్ చెప్పాడు. ఐతే ‘గేమ్ చేంజర్’ ఔట్ పుట్ గురించి మాత్రం అతనేమీ మాట్లాడలేదు.
కానీ కార్తీక్ చెప్పిన ప్రకారమే ఈ కథ ఉండుంటే.. దాన్ని కార్తీకే కనుక తీసి ఉంటే ఔట్ పుట్ వేరేలా ఉండేదేమో.. శంకర్ తన కథను చెడగొట్టేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కార్తీక్ నుంచి ఇటీవల వచ్చిన ‘డోరతీ’ మూవీ చుట్టూ కొన్ని వివాదాలు ముసురుకున్నప్పటికీ.. దానికి క్లాసిక్‌గా పేరొచ్చింది..