రాజానగరం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా మారాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రశాంతత ఉందన్న టాక్ వినిపిస్తుండడం గమనార్హం. 2024 జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన బత్తుల బలరామకృష్ణ ప్రస్తుతం కూటమిని సమన్వయంతో ముందుకు నడిపిస్తున్నారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి(Jakkampudi Raja) రాజా రాజకీయాలకు ఆయన పరోక్షంగా చెక్ పెడుతున్నారు. మరోవైపు వైసీపీలో అంతర్గత విభేదాలు.. జక్కంపూడికి సెగ పెంచుతున్నాయని స్థానికంగా చర్చ నడుస్తోంది.
టీడీపీ(TDP), జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే బత్తుల దృష్టి సారించారు. స్థానిక జనసేన, టీడీపీ శ్రేణులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గాల సమీకరణాలు కీలకంగా ఉన్నాయి. గత వైసీపీ పాలన తర్వాత నియోజకవర్గంలో రాజకీయ వేడి తగ్గి ప్రస్తుతం అధికార పార్టీ నాయకత్వంలో పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా మారిపోయింది.
ప్రతిపక్షం వైసీపీ(YCP) నియోజకవర్గంలో పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి కూటమి నాయకులదే పైచేయిగా ఉంది. ఇక, నియోజకవర్గంలో వైసీపీకి స్థానిక నేతల నుండి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలు గ్రామాల్లో కీలక నాయకులు, సర్పంచ్లు వైసీపీని వీడి జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో కూటమి పార్టీల్లో చేరుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే, స్థానిక నాయకత్వం కేవలం ప్రకటనలు, సోషల్ మీడియా విమర్శలకే పరిమితమైంది. దీంతో క్యాడర్లో ఆశించిన స్థాయిలో జోష్ కనిపించడం లేదు.
అధికార పార్టీ హవా... జనసేన(Janasena) ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం తో, వైసీపీ స్థానిక పట్టు కోల్పోతూ వస్తోంది. ఇది వచ్చే స్థానిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నా రు. పైగా.. నియోజకవర్గంలో రాజా పట్టుకోల్పోతున్న పరిస్థితి కూడా కళ్లకు కడుతోంది. డీఎస్సీపైనిరసన కార్యక్రమాలు చేపట్టినా.. కార్యకర్తలు లేక వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. మొత్తంగా చూస్తే.. రాజా తన సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు చేయకతప్పదు. ఇలానే ఉంటే.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ మరింత డీలా పడుతుందని అంటున్నారు.