పల్నాడు జిల్లాలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయం ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయాలను గమనిస్తే... కూటమి రెండున్నరేళ్ల పాలన తర్వాత.. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హవా పెరిగింది. అయితే, ఇదేసమయంలో ప్రధాన ప్రత్యర్థి కాసు మహేష్ రెడ్డి(Kasu Mahesh Reddy) గత ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు ఒక పార్టీ నుండి మరొక పార్టీకి వలస పోతున్నారు. దీనికితోడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా పల్నాడు జిల్లాలో, ముఖ్యంగా గురజాల(Gurazala), మాచర్ల సరిహద్దుల పరిధిలో మార్పులు చేర్పులు జరగవచ్చనే చర్చ సాగుతోంది. ఇక, ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉండే ఈ నియోజకవర్గం రాజకీయాలు.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరింత కనిపిస్తోంది.
ఇరు పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, స్థానిక వివాదాలు, వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఇక, సామాజిక సమీకరణాల విషయానికి వస్తే.. నియోజకవర్గంలో కమ్మ, రెడ్డి, బీసీ, ఎస్సీ వర్గాల ఓటర్లు గెలుపోటములను శాసించడంలో కీలక పాత్ర పోషిస్తారు. లైమ్‌స్టోన్, క్వారీ పరిశ్రమలు, పారిశ్రామిక రాయితీలు, మంచినీటి సమస్య, ఉపాధి కల్పన వంటివి ఇక్కడి ప్రధాన రాజకీయ ఎజెండాలుగా మారుతుంటాయి.మొత్తంగా చూస్తే, అధికారంలో ఉన్న టీడీపీ(TDP) తన పట్టును నిలుపుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో పుంజుకుని తిరిగి ఆధిక్యం సంపాదించాలని కాసు కూడా వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
స్థానికమే ఆయువు పట్టు
స్థానిక ఎన్నికలను అటు టీడీపీ, ఇటు వైసీపీ(YCP) ఇరు వర్గాలు కూడా తమ రాజకీయ భవిష్యత్తుకు ఆయువు పట్టుగా భావిస్తున్నాయి. దీంతో గ్రామాలు, మండలస్థాయిలో ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉప్పు-నిప్పుగా మారింది ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో తన వారసుడిని రంగంలోకి దింపాలని భావిస్తున్న యరపతినేని.. స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా.. చంద్రబాబు దగ్గర, మంత్రి లోకేష్ దగ్గర మార్కుల కోసంప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి. మరోవైపు.. వచ్చేసారి వైసీపీ అధికారంలోకి వస్తే.. మంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్న కాసు కూడా అంతే సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో గురజాల రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి.