దానం నాగేందర్ కు సుప్రీం చీవాట్లు

admin
Published by Admin — September 25, 2026 in Telangana
News Image

ఖైర‌తాబాద్ నుంచి 2023లో విజ‌యం ద‌క్కించుకున్న దానం నాగేంద‌ర్‌.. త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ పంచ‌కు చేరి పోయారు. తాజాగా త‌న‌ను తాను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసినా.. సుప్రీంకోర్టు సైతం చీవాట్లు పెట్టి.. హైకోర్టు ఇటీవ‌ల ఇచ్చిన అన‌ర్హ‌త తీర్పును స‌మ‌ర్థించింది. దీంతో దానం అన‌ర్హుడ‌య్యారు. వాస్త‌వానికి హైకోర్టులో తీర్పు వ‌చ్చిన త‌ర్వాత‌.. దీనిపై తాను సుప్రీంకోర్టును ఆశ్ర‌యించేది లేద‌ని దానం ప్ర‌క‌టించారు.

కానీ, ఎందుకైనా మంచిద‌ని అనుకున్నారో.. ఏమో.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో రాజ్యాంగంతోనే ఆయ‌న ఆడుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఒక పార్టీ నుంచి ఎన్నికై.. మ‌రోపార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌కూడ‌ద‌ని రాజ్యాంగంలో ఎక్క‌డా లేద‌ని వితండ వాదం చేశారు. నిజానికి ఈ వాద‌న‌ను సుప్రీంకోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఉంటే దేశంలోనే సంచ‌ల‌న వ్య‌వ‌హారంగా మారిపోయేది. కానీ, సుప్రీంకోర్టు ఈ విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించింది.

విచార‌ణ సంద‌ర్భంగా దానం వేసిన పిటిష‌న్‌ను చ‌దివిన‌.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి.. రాజ్యాంగానికి కొత్త భాష్యం చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు. పెద్ద‌లు రాసిన రాజ్యాంగంలోనే లోపాలు వెతుకుతూ.. ఆట‌లాడే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాజ్యాంగంలో లేద‌ని... మీరు చెబుతున్నారు.. ఉన్న ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టాన్నిమీరు పాటిస్తున్నారా? అని చుర‌క‌లు అంటించారు.

అంతేకాదు.. ఇక‌పై ఇలాంటి పిటిష‌న్లుదాఖ‌లు చేసేవారికి గుణ పాఠం చెప్పేలా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని పేర్కొన్నారు.  మొత్తంగా దానం నాగేంద‌ర్ పిటిష‌న్‌ను తోసిపుచ్చ‌డ‌మే కాకుండా.. హైకోర్టు అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసు కుని విచారించిందని పేర్కొన్నారు. దీనిపై మ‌రోసారి విచార‌ణ చేయాల్సిన అవ‌సరం లేద‌ని పేర్కొంటూ.. అన‌ర్హ‌త తీర్పు కొన‌సాగుతుంద‌ని తెలిపారు. అంతేకాదు.. వెంట‌నే ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న జారీ చేసేలా ఉత్త‌ర్వుల్లో పేర్కొంటామ‌న్నారు. దీంతో దానం ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది.

Tags
danam nagendar anti defection supreme court suspended
Recent Comments
Leave a Comment

Related News