ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోకవర్గం కుప్పంలో స్థానిక ఎన్నికల హవా జోరుగా సాగుతోంది. ఇక్కడ కూటమి నాయకులతో పాటు.. టీడీపీ కేడర్ బలంగా ప్రచారం చేస్తోంది. మండలాల వారీగా పార్టీని బలపేతం చేయడంతోపాటు.. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తున్నారు. దీనికి తోడు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి సైతం తరచుగా ఇక్కడ పర్యటిస్తుండడంతో కేడర్‌లో మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది. ఇది.. స్థానిక ఎన్నికల్లో కూటమిని వన్ సైడ్‌గా గెలిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మండలాల వారీ లెక్క ఇదీ..
1) కుప్పం రూరల్: 2021 మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 19 వార్డులు గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అయితే ఇటీవల కొందరు కౌన్సిలర్లు టీడీపీలోకి మారడంతో సమీకరణాలు మారాయి. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ టీడీపీ క్యాడర్ చాలా బలంగా ఉంది. 2024 లో లభించిన లీడ్ ఆధారంగా పట్టణ, రూరల్ ప్రాంతాల్లో టీడీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.
2) రామకుప్పం: గత జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ 16 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. స్థానికంగా బలమైన నాయకత్వం ఉంది. కానీ, 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) ప్రభావంతో ఇక్కడ టీడీపీ తిరిగి పుంజుకుంది. తటస్థ ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు వైసీపీ బలం దాదాపు తగ్గిపోయింది.
3) శాంతిపురం: 2021లో ఇక్కడ జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ దాదాపు 16,800 ఓట్ల తేడాతో ఏకపక్షంగా గెలుచుకుంది. ప్రస్తుతం అధికార కూటమి ప్రభావంతో ఇక్కడ వైసీపీకి క్యాడర్ పరంగా దూరమైంది. టీడీపీ శ్రేణులు గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలను నాయకులు తమవైపు తిప్పుకొన్నారు. శాంతిపురంలో ఏ ఇంటిని పలకరించినా.. టీడీపీ పేరే చెబుతున్నారు.
4) గుడుపల్లె: గత పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో గుడుపల్లెలో కూడా వైసీపీ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, స్థానిక పోలీసు నియామకాలు, కఠినమైన శాంతిభద్రతల చర్యల వల్ల గతంలోలాగా ఏకపక్షంగా ఓట్లు సాధించడం వైసీపీకి కష్టతరంగా మారింది. అంతేకాదు.. గుడుపల్లెలో ఇటీవల 100 కుటుంబాలు నారా భువనేశ్వరి సమక్షంలో పార్టీ మారి సైకిల్ ఎక్కాయి.