తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ ఉదంతం ఊహించని మలుపులు తిరుగుతోంది. పదవి కోల్పోయిన మరుసటి రోజే కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగడం, ఆమెకు నేరుగా ఢిల్లీ నుంచి పిలుపురావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ పరిణామం వెనుక అధిష్ఠానం పెద్దల మాస్టర్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
మంత్రి పదవిని కోల్పోయిన వెంటనే కొండా సురేఖ అనుచరులు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన, అసంతృప్తి వ్యక్తమయ్యాయి. పరిస్థితి చేయిజారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పెద్దలు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగి కొండా సురేఖతో ఫోన్ ద్వారా సుదీర్ఘంగా మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరుతూనే, అధిష్ఠానం ఆమె వెంటే ఉంటుందనే బలమైన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ సంభాషణ ముగిసిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ(Delhi) నుంచి పిలుపురావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
బుజ్జగింపులతో పాటు భారీ ఆఫర్?
కేవలం కేబినెట్ నుంచి తప్పించి ఊరుకుంటే పార్టీకి, ముఖ్యంగా బలమైన సామాజిక వర్గంలో నష్టం జరుగుతుందనే అంచనాకు హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సురేఖను కేవలం బుజ్జగించడమే కాకుండా, ఆమెకు మరింత ప్రాధాన్యత ఉన్న కీలక పదవిని అప్పగించే దిశగా కాంగ్రెస్(Congress) పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో కేబినెట్ హోదా కలిగిన ఏదైనా నామినేటెడ్ లేదా కీలక బాధ్యతను ఆమెకు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు ఇన్‌సైడ్ టాక్.
ఇక హైకమాండ్ ఆహ్వానం మేరకు కొండా సురేఖ(Konda Surekha) ఢిల్లీకి పయనం కావడం, పార్టీ పెద్దలతో ఆమె భేటీ కానుండటం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి మంత్రి పదవి పోయిందన్న బాధలో ఉన్న కొండా సురేఖకు ఢిల్లీ పెద్దలు ఎలాంటి కీలక పదవిని కేటాయించబోతున్నారు? ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది.