టీడీపీ ఎంపీలు.. వైసీపీలో దడ పుట్టించారు. ఉరుకులు పరుగులు పెట్టేలా చేశారు. ఆవెంటనే వైసీపీకేంద్ర కార్యాలయానికి సమాచారం చేరవేశారు. ఏం చేయాలంటూ.. కేంద్ర కార్యాలయం సలహా తీసుకున్నారు. అయితే.. టీడీపీ ఎంపీలు.. వైసీపీ నేతలు ఊహించినట్టు వ్యవహరించలేదని తెలుసుకుని శాంతించారు. టీకప్పులో తుఫాను మాదిరిగా జరిగిన ఢిల్లీ వ్యవహారం.. ఓ రెండు గంటల పాటు వైసీపీకి దడ పుట్టించడం గమనార్హం.
ఏం జరిగింది?
టీడీపీ ఎంపీలు సోమవారం మధ్యాహ్నం.. పార్లమెంటు కార్యాలయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ పరిణామం.. వైసీపీ ఎంపీలను ఇరుకున పడేసింది. ఇక, అమిత్ షాను కలిసిన వారిలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయు లు, తెన్నేటి కృష్ణప్రసాద్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చింతకాయల విజయ్, శబరి, సానా సతీష్, బీద మస్తాన్‌రావు ఉన్నారు. అయితే.. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వీరంతా ఒక్కసారిగా షాను కలుసుకోవడం వెనుక.. వారు జగన్‌పై ఫిర్యాదు చేసేందుకు, వైసీపీ ఏపీలో చేపట్టిన నిరసనలపై ఫిర్యాదులు అందించేందుకే కలిశారని వైసీపీలో చర్చ సాగింది.
దీంతో హుటాహుటిన వైసీపీ ఎంపీలు అలెర్ట్ అయ్యారు. టీడీపీ ఎంపీలు.. కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారన్న సమాచా రాన్ని ముందుగానే వైసీపీ కేంద్ర కార్యాలయానికి అందించారు. అయితే.. ``ఏం జరుగుతుందో చూడండి`` అంటూ కార్యాలయం నుంచివారికి సమాచారం అందింది. అంతేకాదు.. తేడా వస్తే.. మీరు కూడా వెళ్లి.. కౌంటర్ ఫిర్యాదులు ఇవ్వాలంటూ.. ఆదేశాలు అందినట్టు సమాచారం. దీంతో వైసీపీ ఎంపీలు అలెర్ట్ అయ్యారు. కానీ... టీడీపీ ఎంపీలు వైసీపీ గురించి కానీ.. జగన్ గురించి కానీ.. అమిత్‌షాకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని తెలిసి.. ఊపిరి పీల్చుకున్నారు.
ఏం చేశారంటే..
అమిత్‌షాను కలిసిన టీడీపీ ఎంపీల బృందం.. ఏపీలో నిర్మిస్తున్న అమరావతి పనులను ఆయనకు వివరించారు. రేయింబవళ్లు అమరావతి నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలు.. ప్రస్తుతం పూర్తయిన భవనాలు, త్వరలోనే పూర్తికానున్న భవనాలు.. ఇలా అన్ని విషయాలను ఆయనతో పంచుకున్నారు. అదేసమయంలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి రూపొందించి కాఫీ టేబుల్ బుక్‌ను ఆయనకు అందించారు. నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని ఆయనకు విన్నవించారు. అయితే.. ఇటీవల పార్లమెంటులో వైసీపీ అధినేత కేసుల విషయంపై చింతకాయల విజయ్ ప్రస్తావించడం.. కేసులను వేగవంతం చేయాలని కోరిన నేపథ్యంలో జగన్‌పై ఫిర్యాదు చేసేందుకే టీడీపీ ఎంపీలు ఇలా అమిత్ షాతో భేటీ అయ్యారని వైసీపీ గాబరా పడడం గమనార్హం.