ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు సభకు క్రమం తప్పకుండా హాజరుకావడం వారి ప్రాథమిక బాధ్యత. అయితే, సమావేశాలకు డుమ్మా కొట్టే నేతల తీరుపై ఎప్పటికెప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో ప్రతినిధుల ప్రెజెన్స్‌పై అత్యంత కఠినమైన నిబంధనను అమల్లోకి తీసుకువచ్చేందుకు సభాపతి అయ్యన్నపాత్రుడు సన్నద్ధమవుతున్నారు. కేవలం నామమాత్రపు సంతకాలు పెట్టి వెళ్లిపోవడానికి వీళ్లేకుండా హైటెక్ నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇకపై అసెంబ్లీ హాల్‌లో ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చుంటేనే వారి ఉనికి అధికారిక లెక్కలోకి వస్తుంది. సభ్యులు తమ స్థానాల్లో ఆసీనులైన వెంటనే, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆటోమేటిక్ కెమెరాలు అన్నీ వాటంతట అవే ఆన్ అవుతాయి. ఆ కెమెరాల కంట్లో పడి, రికార్డైతేనే సదరు ఎమ్మెల్యే ఆ రోజు సభకు హాజరైనట్లు పరిగణిస్తారు. లేదంటే ఎంతసేపు సభలో ఉన్నా హాజరు పడదు. ఈ సరికొత్త టెక్నాలజీ విధానంతో సభకు రాకుండా గోడ వెనక తిరిగే వైసీపీ(YCP) నేతలకు చెక్ పెట్టనున్నారు.
మరోవైపు, సభకు పూర్తిగా హాజరు కాని ప్రజా ప్రతినిధులపై ఆర్థికపరమైన కోత విధించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyanna Patrudu) తెలిపారు. సమావేశాలకు ముఖం చాటేసే ఎమ్మెల్యేల వేతనాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరినట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలను శాసనసభ వేదికగా చర్చించి పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఓటర్లు ఎన్నుకుంటారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.