ఏపీ రాజకీయాల్లో టీడీపీ(TDP), జనసేన మైత్రి ఎంతో పటిష్టంగా సాగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని చోట్ల ఈ రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇరు పార్టీల అధినేతలకు తలనొప్పిగా పరిణమించింది.
వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) ఎంట్రీ నాటి నుంచే ఒంగోలులో వర్గపోరు మొదలైంది. గడచిన ప్రభుత్వ హయాంలో బాలినేని తమపై అక్రమ కేసులు పెట్టారంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కూటమి ధర్మం కోసం కొన్నాళ్లుగా ఇద్దరూ పైకి సర్దుకుపోయినట్లు కనిపించినా, తాజాగా ఆ అంతర్గత అసంతృప్తి తారాస్థాయికి చేరింది.
తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి నేరుగా మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే దామచర్లపై సంచలన ఆరోపణలు గుప్పించారు. దామచర్ల ఒంగోలు(Ongole)లో 'నేనే రాజు నేనే మంత్రి' అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇసుక దందాలు, మద్యం మాఫియాతో పాటు రాజుపాలెం రొయ్యల చెరువుల ఆక్రమణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి.
బాలినేని విమర్శలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్(MLA Damacharla Janardhana Rao) కూడా అంతే గట్టిగా స్పందించారు. బాలినేని జనసేన పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ వైసీపీ అజెండాతోనే పనిచేస్తున్నారని, తనపై కుట్రపూరితంగా కరపత్రాలు పంచుతూ బురదజల్లుతున్నారని ఎదురుదాడికి దిగారు. బాలినేని, ఆయన కుమారుడి అవినీతి బాగోతాలు బయటపెట్టాలంటే కాగితాలు సరిపోవని, ఏకంగా పుస్తకాలే కావాలంటూ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
పొత్తులో ఉంటూ మిత్రపక్ష నేతలే బహిరంగంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం కూటమి రాజకీయ భవిష్యత్తుకు శుభపరిణామం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్గత సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాల్సింది పోయి, ఇలా రోడ్డుకెక్కడం ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ(YCP)కి పండగలా మారింది. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే క్షేత్రస్థాయిలో కూటమి బలం దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ వివాదంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.