ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడిన దానం నాగేందర్.. యూటర్న్ తీసుకున్నారు. తన కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదే శాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించబోనని చెప్పిన ఆయన అనూహ్యంగా శనివారం సాయంత్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేశారు. హైకోర్టు నిర్ణయం సరిగా లేదని.. క్షేత్రస్థాయి వాస్తవాలను పూర్తిగా పరిశీలించకుండానే తీర్పు ఇచ్చిందని తన పిటిషన్లో దానం పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవాలని విన్నవించారు.
ఇక, దానం నాగేందర్.. సుప్రీంకోర్టును ఆశ్రయించబోనని చెప్పినప్పటికీ.. ఆయన నిర్ణయాన్ని ముందుగానే ఊహించిన బీఆర్ ఎస్ నాయక త్వం కూడా సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. దానం నాగేందర్ పిటిషన్ వేసిన మరుక్షణమే బీఆర్ ఎస్ తరఫున `కేవియెట్` పిటిషన్‌ను దాఖలు చేయడం గమనార్హం. కేవియట్ అంటే.. దానం పిటిషన్‌పై తీర్పు వెలువరించే ముందు.. తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్ ఎస్ కోరింది. ఈ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈ రెండు పిటిషన్లపైనా సోమవారం విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు.
ఎవరి వాదన ఏంటి?
దానం నాగేందర్.. పిటిషన్లో తనకు ఏ పాపం తెలియదని.. తాను రాజకీయ కక్ష సాధింపులకు గురయ్యానని పేర్కొన్నారు. పైగా.. తాను బీఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నట్టుగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ చెప్పారని ఆయన స్పీకర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను జత చేశారు. అసెంబ్లీకి సంబంధిం చి స్పీకర్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని.. న్యాయ వ్యవస్థ దీనిలో జోక్యం చేసుకునే అవకాశం లేదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను కూడా ఆయన ఉదహరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును కొట్టి వేయాలని.. తనను ఎమ్మెల్యేగానే పరిగణించాలని దానం కోరుతున్నారు.
బీఆర్ ఎస్ వాదన ఇదీ..
దానం 2023లో తమ పార్టీ టికెట్‌పై విజయం దక్కించుకుని తర్వాత.. పార్టీ ఫిరాయించారని పేర్కొంది. ఆయన 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన విషయాన్ని కూడా పిటిషన్లో ప్రస్తావించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని.. ప్రభుత్వ అనుకూల కార్యక్రమాలకు హాజరవుతున్నారని కూడా పేర్కొన్నారు. పార్లమెంటులో పోటీ చేయడం అంటే.. సదరు పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని కలిగి ఉండకుండా ఇది సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయం.. పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థిస్తోంది.