చిత్తూరు జిల్లాలోని పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. ఒకప్పుడు రెడ్ల హవా ఎక్కువగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం బీసీ జనాభా పెరుగుతున్న దరిమిలా.. రాజకీయాలు కూడా అలానే మారుతు న్నాయి. దశాబ్దాలుగా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి, తెలుగుదేశం పార్టీ కి మధ్య తీవ్రమైన రాజకీయ పోరు నడుస్తోంది. 2024 ఎన్నికల్లో పెద్దిరెడ్డి కేవలం 6 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. ఇక, మండలాల వారీగా పరిస్థితిని గమనిస్తే.. పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. కొత్త జిల్లాల విభజన తర్వాత ఇవి వేర్వేరు జిల్లాల్లో, రెవెన్యూ డివిజన్లలో విస్తరించి ఉన్నప్పటికీ, రాజకీయంగా ఈ 6 మండలాల పరిధిలోనే సమీకరణాలు మారుతుంటాయి.
పుంగనూరు: ఇది నియోజకవర్గ కేంద్రం. పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రధానంగా కంచు కోట. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడి అన్ని ఎంపీటీసీ స్థానాలను, మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వర్గాలు. ముస్లిం మైనారిటీల ఓట్లు కీలకంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి , మధుసూదన్ నాయుడు వంటి నేతలు ప్రజల్లో పర్యటిస్తూ వైసీపీ పట్టును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
చౌడేపల్లె: సాంప్రదాయకంగా వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపే మండలం ఇదే. పెద్దిరెడ్డి అనుచర వర్గం ఇక్కడ బలంగా ఉంటుంది. వ్యవసాయం, డైరీ రంగంపై ఆధారపడిన ఈ మండలంలో సామాజిక సమీకరణాల ఆధారంగా ఓట్లు పడతాయి. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓట్ల శాతం గణనీయంగా పెరగడం పెద్దిరెడ్డి వర్గానికి హెచ్చరికగా మారింది.
సోమల: ఈ మండలంలో టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ కు ఇక్కడ కొంత బలగం ఉంది, ఇది ఓట్ల చీలికకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మండలంలో టీడీపీ క్యాడర్ యాక్టివ్ అయింది. పెద్దిరెడ్డి వ్యతిరేక ఓట్లను ఏకం చేసేందుకు ఇక్కడ తెలుగుదేశం గట్టిగా ప్రయత్నిస్తోంది.
సదుం: ఇది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం కావడంతో ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ వైపు సానుభూతి ఉండేది. పెద్దిరెడ్డి హయాంలో ఇక్కడ వైఎస్సార్సీపీ బలపడినప్పటికీ, ప్రస్తుత కూటమి అధికారంలోకి రావడం, నల్లారి వర్గం సపోర్ట్ చేయడంతో సదుం మండలంలో మళ్లీ టీడీపీ/కూటమి పుంజుకుంటోంది.
పులిచెర్ల: ఈ మండలం చిత్తూరు రెవెన్యూ పరిధికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ రెడ్డి, బీసీ సామాజిక వర్గాల జనాభా ఎక్కుగా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మండలం నుంచి టీడీపీకి ఆశించిన స్థాయిలో ఓట్లు పడ్డాయి. గతంలో ఏకపక్షంగా ఉన్న వైసీపీ ఆధిపత్యానికి ఇక్కడ బ్రేకులు పడ్డాయి.
రొంపిచర్ల: రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన మండలం. ఇక్కడ ఫ్యాక్షన్, స్థానిక గ్రూపు రాజకీయాల ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఇక్కడ ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అధికార మార్పిడి తర్వాత వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు సైలెంట్ అవ్వగా, టీడీపీ నేతలు ఇక్కడ పట్టు సాధించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. గతంలో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ చేసిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు బీసీల ఆధిపత్యం పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది.