వైసీపీలో ముసలం.. సొంత పార్టీకి కేతిరెడ్డి షాక్‌.!

admin
Published by Admin — August 01, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగే మాటల యుద్ధాలు, విమర్శల కంటే కూడా... సొంత పార్టీలోనే అంతర్గతంగా నడిచే పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. సరిగ్గా ఇలాంటి లొల్లె ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ(YCP)లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకప్పుడు తనదైన శైలిలో ప్రజల్లో ఉంటూ, వినూత్న రీతిలో పలకరింపులతో రెండు రాష్ట్రాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆ పార్టీ నేత... ఇప్పుడు సొంత పార్టీ నాయకులకే షాకిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Kethireddy Venkata ramiReddy) ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై తన గొంతు గట్టిగానే వినిపిస్తున్న కేతిరెడ్డి... పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ప్రజల కోసం బైక్ ర్యాలీలు చేయడం, ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా వేదికగా నిలదీయడంలో ముందుంటున్న ఆయన... జిల్లా స్థాయి అధికారిక పార్టీ కార్యక్రమాలకు మాత్రం ముఖం చాటేస్తున్నారు. హంద్రీనీవా కాలువపై నిర్వహించిన పాదయాత్ర కావచ్చు, కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన దీక్షలు కావచ్చు, లేదా ఎస్పీని కలవడం లాంటి కీలక కార్యక్రమాలు ఏవీ ఆయన జాడే కనిపించడం లేదు. దీంతో ఆయన అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? పార్టీ నేతలతో ఎడమొహం పెడమొహంగా ఎందుకు ఉంటున్నారు? అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ దూరం వెనుక ప్రధానంగా స్థానిక నాయకుల మధ్య పొసగని రాజకీయ సమీకరణాలే కారణమని తెలుస్తోంది. పక్కనే ఉన్న మరో నియోజకవర్గ నేతతో జరిగిన వర్గపోరు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కేతిరెడ్డి((Kethireddy)ని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని సమాచారం. గతంలో జరిగిన కొన్ని ఘటనల్లో సొంత పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత ఎదురుకావడం, వ్యక్తిగత విమర్శలు రావడంతో ఆయన తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందరికీ గుడ్ మార్నింగ్ చెబుతూ కలివిడిగా ఉండే నాయకుడే... నేడు సొంత పార్టీ పెద్దలకు మాత్రం బ్యాడ్ మార్నింగ్ చెబుతున్నట్లుగా ఈ పరిణామాలు మారుతున్నాయి. మరి ఈ అంతర్గత విభేదాలు భవిష్యత్తులో పార్టీకి ఎలాంటి నష్టం చేస్తాయో, అధిష్టానం ఈ దూరాన్ని ఎలా సరిదిద్దుతుందో వేచి చూడాలి.

Tags
YSRCP Kethireddy Venkatrami Reddy Andhra Pradesh AP Politics Dharmavaram AP News Latest News
Recent Comments
Leave a Comment

Related News