కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ అరీనాలో 'సిలికానాంధ్ర' రజతోత్సవ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతీసంప్రదాయాలు, కళల పరిరక్షణే లక్ష్యంగా 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన 'సిలికానాంధ్ర' పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకల ఆరంభం అదిరింది. తొలి రోజు కార్యక్రమాలలో భాగంగా డ్రైరన్ తో పాటు ఈ రోజు సాయంత్రం గురు వందనం కార్యక్రమం జరగనుందని సిలికానాంధ్రా అధ్యక్షురాలు సత్యప్రియ తణుగుల తెలిపారు.
సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలకు స్పాన్సర్ చేసిన దాతలందరినీ సన్మానించి సత్కరించేందుకు గురువందనం కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. వారి పట్ల సిలికానాంధ్రా సభ్యులకు ఉన్న ప్రేమాప్యాయతలను చూపించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. బాంకెట్ డిన్నర్ లా కాకుండా వారందరికీ పదహారణాల తెలుగు భోజనం వడ్డించనున్నామని అన్నారు. స్పాన్సర్లకు పానకంతో స్వాగతం పలికి అల్పాహారంతోపాటు అరిటాకుల్లో సిలికానాంధ్రా సైనికులు విందు భోజనం పెట్టబోతున్నారని చెప్పారు.
వారికి వడ్డించే సిలికానాంధ్ర సైనికులంతా పెద్ద పెద్ద ఐటీ కంపెనీల సీఈవోలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారని సత్యప్రియ వెల్లడించారు. అయినప్పటికీ వారంతా సిలికానాంద్ర కుటుంబ సభ్యులుగా ఈ వేడుకల్లో పాల్గొని స్పాన్సర్లకు ఆప్యాయంగా, అన్యోన్యంగా వడ్డిస్తారని తెలిపారు. భారతదేశం నుంచి కొందరు మంత్రులు, జర్నలిస్టులు, సినీ రంగం నుంచి ఎందరో ప్రముఖులు ఇక్కడికి తరలివచ్చారని చెప్పారు. సిలికానాంధ్రా అంటే భావితరాలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయం, కళలను అందించే ఒక గొప్ప వేదిక అని అన్నారు.
ఈ రోజు పిల్లలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఒక తెలుగు పండుగను తలపించే వాతావరణం ఇక్కడ ఉండడం సంతోషంగా ఉందని సత్యప్రియ తణుగుల చెప్పారు. ఈ రోజు ఒగ్గు కథ చెప్పామని, రేపు రజతోత్సవ వేడుకల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలున్నాయని, రేపటి కార్యక్రమాలకు దాదాపు 10 వేల మంది హాజరయ్యే అవకాశముందని అన్నారు.
పాతికేళ్ల ‘సిలికానాంధ్ర’ ప్రస్థానంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల పాత్ర వెలకట్టలేనిది. సిలికానాంధ్రకు ఆయన మరపురాని సేవలందించారు. 25 ఏళ్లుగా ఒంటిచేత్తో సిలికానాంధ్ర బాధ్యతలను ఆనంద్ కూచిభొట్ల తన భుజస్కందాలపై మోశారంటే అతిశయోక్తి కాదు. ఆయన పర్యవేక్షణలో ఈ రజతోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.
తొలి రోజు కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల, ‘ఈనాడు’ ఎడిటర్ ఎం.నాగేశ్వర రావు, ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, డాక్టర్ హనిమిరెడ్డి లక్కిరెడ్డి, స్థానిక డాక్టర్లు, స్థానిక ప్రముఖులు, ఉత్తరాదికి చెందిన పలువురు ఎన్నారై స్పాన్సర్లు, పలువురు ఎన్నారైలు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రా గోలీ సోడాలను స్థానికంగా ఉన్న భీమవరం రుచులు రెస్టారెంట్ నిర్వాహకులు ఆంధ్రా నుంచి ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా తెప్పించి విక్రయించారు. అమెరికాలో స్థిరపడిన 1960-90 తరం ఆంధ్రావాళ్లు ఈ గోలీ సోడాలను ఎంతగానో ఆస్వాదించారు. ఆటోగ్రాఫ్ స్వీట్ మెమెరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’... అంటూ ఆ గోలీ సోడాతో తమకు చిన్ననాటి నుంచి ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇక, గోలీసోడా అంటే ఏంటో తెలియని జెన్ జీ, జెన్ ఆల్పా కిడ్స్ అయితే వాటిని చూసి ఆశ్చర్యపోయారు. తొలిసారి ఆ గోలీ సోడాల రుచి చూసేందుకు వారంతా ఎంతో ఉత్సాహం చూపారు. బ్రేవ్...అంటూ గోలీసోడా రుచిని...అది ఇచ్చిన అనుభూతిని ఎంతగానో ఆస్వాదించారు.