సొంత పార్టీపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బోండా ఉమ కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాలేదని, వైసీపీ, జనసేన నుంచి వచ్చిన నేతలుకు మంత్రి పదవులు దక్కాయని బహిరంగ వేదికపైనే అసంతృప్తిని ఉమ వెళ్లగక్కారు. ఇక, కాపుల ఉద్యమం వల్లే 2019లో టీడీపీ ఓడిపోయింది అంటూ ఉమ చేసిన వ్యాఖ్యలు టిడిపి అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదికను పంచుకోవడం, అంబటిని ఆలింగం చేసుకొని ఆప్యాయంగా పలకరించడం వంటి పరిణామాలతో ఉమపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవద్దు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఉమ ఆ కార్యక్రమానికి ఎందుకు వెళ్లారో చెప్పాలని ఉమకు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరావుతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ నేత కిలారు రాజేష్ లతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని బోండా ఉమను పార్టీ అధిష్టానం ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే కమిటీ ముందు హాజరై బోండా ఉమ తన వివరణను ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. పాతికేళ్లుగా టీడీపీలోనే ఉన్నానని, ఏనాడు పార్టీ లైన్ దాటలేదని, ఇకపై కూడా దాటబోనని ఉమ చెప్పారు. చంద్రబాబు ఆదేశాలను ఏనాడూ ధిక్కరించ లేదని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. ముద్రగడ సంస్మరణ సభ సందర్భంగా అంబటి రాంబాబుతో మాట్లాడిన మాట వాస్తవమేనని, అది కేవలం కాపులకు సంబంధించిన సభగా మాత్రమే పరిగణించి తాను హాజరయ్యానని ఉమ చెప్పారు.
అయితే తన మాటలను కొందరు వక్రీకరించారని, సోషల్ మీడియాలో తనపై అనవసరంగా ట్రోలింగ్ చేశారని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వైసీపీ నేతలతో కలిసి వేదికను పంచుకోబోనని, అటువంటి కార్యక్రమాలకు హాజరుకానని ఉమ తేల్చి చెప్పారు.