హైడ్రా రంగనాథ్ కోసం రేవంత్ న్యాయపోరాటం

admin
Published by Admin — July 28, 2026 in Telangana
News Image

సాధారణంగా జరిగే అంశాల్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా.. రోటీన్ తీరుకు ఏ మాత్రం సంబంధం లేని విధంగా చోటు చేసుకునే విషయాల్ని పక్కాగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఉన్నత న్యాయస్థానాలు సీరియస్ అయిన వేళ.. ఉన్నతాధికారులు మొదలు కొని అధికార యంత్రాంగం సైతం మిన్నకుండిపోవటం ఇప్పటివరకు చూశాం. అందుకు భిన్నంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వంలో నిత్యం సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న హైడ్రా.. సోమవారం మరోసారి మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. లోతుకుంటకు చెందిన భూవివాదానికి సంబంధించి హైడ్రా తీరును తెలంగాణ హైకోర్టు తప్పు పట్టటమే కాదు.. దాని చీఫ్ రంగనాథ్ వ్యవహారశైలిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. వీలైనంత వేగంగా ఆయనను హైడ్రా కమిషనర్ గా తొలగించాలంటూ సీఎస్ (చీఫ్ సెక్రటరీ) విజ్ఞప్తి చేయటం సంచలనంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ పదే పదే కోర్టు ఉల్లంఘటనకు పాల్పడుతున్నారని.. ఆయనపై ఇప్పటివరకు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదయ్యాయని.. ఇలాంటి అధికారిని అలానే పదవిలో కొనసాగిస్తే న్యాయవ్యవస్థ గౌరవ మర్యాదలకు.. చట్టబద్ధమైన పాలనకు ప్రమాదమని పేర్కొంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. ఆయన్ను పదవి నుంచి తప్పించాలని చెప్పటం తెలిసిందే. హైకోర్టు సింగిల్ బెంచ్ చేసిన వ్యాఖ్యలకు కొన్ని గంటల వ్యవధిలోనే హైడ్రా రంగనాథ్ స్పందించారు. సోమవారం రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన పేర్కొన్న అంశాలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి.

తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నట్లుగా పేర్కొన్న రంగనాథ్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు.. చెరువులు.. పార్కులు కాపాడినట్లుగా పేర్కొన్నారు. రూ.1.5 లక్షల కోట్ల భూములను కబ్జాదారుల నుంచి కాపాడినట్లుగా ఆయన పేర్కొన్నారు. బడా బాబుల భూఆక్రమణలకు చెక్ పెడుతున్నామని పేర్కొన్న రంగనాథ్.. ‘వారు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజాయితీగా.. నిర్భయంగా.. నిబద్ధతతో పని చేసే హైడ్రాకు ధైర్యం ఎక్కువ. రూ.10వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని శాంతా శ్రీరామ్ కంపెనీ కాజేయాలని చూసింది. అనుమతి లేకుండా వేల ఏళ్ల చరిత్ర ఉన్న రాతి కొండలను బ్లాస్టింగ్ చేస్తున్నారు.

పర్యావరణ శాఖ అనుమతి లేకుండా వందల చెట్లు తొలగిస్తున్నారు. మూడు కిలోమీటర్ల ఆవల ఉన్న సర్వే నంబర్లు చూపుతూ 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారు. నాపైనే కోర్టు ధిక్కరణ కేసు వేశారు. నాపై ఉన్న 63 కోర్టు ధిక్కరణ కేసులు బడా భూకబ్జాదారులు వేసినవే. బతుకమ్మకుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు.. లోతుకుంటలో వేలాది కోట్ల రూపాయిల ప్రభుత్వ భూములు ఆక్రమించాలనుకున్న మరో సంస్థ.. సామాన్యుల ఫ్లాట్లు కబ్జా చేసి బహుళ అంతస్తుల భవనాలు కట్టే ప్రయత్నం చేస్తున్న సంధ్య శ్రీధర్ రావు.. వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఫ్లాట్లు ఆక్రమించాలని చూసిన నల్ల మల్లారెడ్డి.. సామాన్యుల ఫ్లాట్లు ఆక్రమించిన ముఖీం.. లాంటి వారు ఈ ధిక్కరణ కేసులు వేశారు’’ అంటూ తనపై కేసులు వేసిన వారి గుట్టు విప్పే ప్రయత్నం చేశారు.

చివర్లో తనకు కోర్టుల మీద పూర్తి నమ్మకం.. చట్టాలపై గౌరవం ఉందన్న రంగనాథ్.. ప్రభుత్వం తనకు అప్పగించిన పనిలో వంద శాతం ఫలితాలు సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానాలు ఆగ్రహావేశాల్ని ప్రదర్శించే సందర్భంలో.. ఈ తరహాలో లేఖ ఒకటి విడుదల కావటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని అంటున్నారు. మరి.. దీనికి న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే, రంగనాథ్ విషయంలో న్యాయపోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ అధికారిని నియమించాలో అన్న విచక్షణ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.

Tags
cm revanth reddy hydra ranganath high court legal fight
Recent Comments
Leave a Comment

Related News