సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకుల దగ్గరి నుంచి రాజకీయ నాయకుల భవిష్యత్తు వరకు.. ఏది హాట్ టాపిక్ అయితే తన జాతకాల క్యాలిక్యులేషన్స్ తో అక్కడ వాలిపోవడం వేణు స్వామి(Venu Swamy)కి అలవాటు. అయితే 2024 ఎన్నికల్లో ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని, కేటీఆర్ సీఎం అవుతారని ఆయన చెప్పిన జాతకాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆ ఫలితాల తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన.. ఇప్పుడు నేరుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తూ మరోసారి సంచలన జోస్యంతో ముందుకొచ్చారు.
ప్రస్తుతం దేశ రాజకీయాలను తన ఉద్యమంతో కుదిపేస్తున్న 'సీజేపీ' (Cockroach Janta Party) జాతక చక్రాన్ని వేణు స్వామి తాజాగా విశ్లేషించారు. భవిష్యత్తులో దేశ రాజకీయాలను శాసించే స్థాయికి సీజేపీ ఎదుగుతుందని, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించడంలో ఆ పార్టీది కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సీజేపీకి గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయని, ఆ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరగడం ఖాయమని తన మార్క్ జాతకం చెప్పారు.
అయితే, సీజేపీ ఎదుగుదల ఒక ఎత్తైతే.. ఆ పార్టీ వల్ల జరగబోయే పరిణామాలు మరో ఎత్తు అని వేణు స్వామి హెచ్చరించారు. ఈ క్రమంలోనే సీజేపీకి చెందిన ముగ్గురు కీలక నాయకులు భవిష్యత్తులో జైలు పాలు కాక తప్పదని ఆయన బాంబ్ పేల్చారు. అలాగే, ఈ పార్టీ భవిష్యత్తులో హిందూ ధర్మానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకునే దిశగా వెళ్లే ప్రమాదం ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకునే మార్పుల వల్ల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసే పరిస్థితులు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక సీజేపీ ఎంట్రీతో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి (BJP) భారీ కుదుపు తప్పదని వేణు స్వామి జోస్యం చెప్పారు. సీజేపీ దెబ్బకు బీజేపీకి దాదాపు 90 శాతం మేర తీవ్రమైన రాజకీయ ఎదురుదెబ్బలు తగిలే ఛాన్స్ ఉందని ఆయన విశ్లేషించారు. అసలే దేశంలో సీజేపీ ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అభాసుపాలైన వేణు స్వామి.. ఇప్పుడు దేశ రాజకీయాలపై చెప్పిన ఈ జాతకమైనా నిజమవుతుందా? లేక ఎప్పటిలాగే తుస్ మంటుందా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.