మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. హోం మంత్రి అనితకు సిగ్గుంటే ఆవిడ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని అంబటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే అంబటి దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సత్తెనపల్లిలో దగ్ధం చేశారు. అయినా సరే అంబటి నోటి దురుసు తగ్గలేదు. గుంటూరులో ఓ మహిళపై టీడీపీ నేత దాడి చేసిన ఘటనలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిపై అంబటి రాంబాబు నోరు పారేసుకున్నారు.
దీంతో అంబటిపై పరువు నష్టం దావా వేస్తానని గల్లా మాధవి చెప్పారు. అయితే, అంబటి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ మరోసారి దురుసుగా మాట్లాడారు. గుంటూరులో మహిళళను వివిస్త్రను చేసిన ఘటనను సెటిల్ చేసేందుకు మాధవి ప్రయత్నించారని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని అంబటి అన్నారు. తనపై మాధవి పరువు నష్టం దావా వేసుకోవచ్చంటూ సవాల్ విసిరారు.
కాగా, అంతకుముందు అనితపై అంబటి కామెంట్ల నేపథ్యంలో సత్తెనపల్లిలో అంబటి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆ వ్యవహారంపై కూడా ఆయన స్పందించారు. తన దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తే గడ్డి మాత్రమే కాలుతుంది తన శరీరానికి ఏమీ కాదని వెటకారంగా మాట్లాడారు. తన వ్యాఖ్యల వల్ల మందకృష్ణ మాదిగ బాధపడి ఉంటే ఆయనకు క్షమాపణలు చెబుతానని, ఆయన అంటే గౌరవమని అన్నారు. కానీ, హోం మంత్రి అనితకు మాత్రం క్షమాపణలు చెప్పే ప్రసక్త లేదని చెప్పారు.