టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ షూటింగ్ లో గాయపడ్డారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 111వ సినిమా షూటింగ్‌లో ఆయనకు స్వల్ప గాయమైంది. బాలయ్య బాబు మోకాలి కండరానికి గాయం కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఫోన్ లో మాట్లాడారు.
"సెట్‌లో బాలకృష్ణ గారికి గాయమైందని తెలిసి ఆయనతో మాట్లాడాను. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆయనది అలుపెరగని స్ఫూర్తి. త్వరలోనే మళ్లీ షూటింగ్‌కు హాజరవుతారు. త్వరగా కోలుకోండి" అని చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన మేనమామ బాలయ్యకు అల్లుడు నారా లోకేశ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాలా మావయ్య త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు. బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలని జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కోరుకున్నారు.
కాకినాడలో బాలకృష్ణ, మంచు మనోజ్‌పై ఓ కీలక యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలకృష్ణకు ఒక చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుందని సూచించినట్లు తెలుస్తోంది. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని చిత్ర బృందం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలయ్య-గోపీచంద్ కాంబోలో వస్తున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలున్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య బాబు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిరాయ్ చిత్రంలో విలన్ గా విమర్శకులను సైతం మెప్పించిన మంచు మనోజ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.