నటుడిగా మంచి పేరు సంపాదించినా.. హీరోగా సరైన బాక్సాఫీస్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు తిరువీర్. హీరో నటించి ప్రతి సినిమా మీదా అతను ఎన్నో ఆశలు పెట్టుకోవడం.. చివరికి కోరుకున్న విజయం దక్కక అతను నిరాశపడడం మామూలైపోయింది. ఐతే హీరోగా తిరువీర్ కెరీర్లో ది బెస్ట్ అనే పేరు వచ్చినా, మంచి రివ్యూలు తెచ్చుకున్నా సరే.. ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ విజయవంతం కాలేదు. ఆ చిత్రాన్ని సరిగా ప్రమోట్ చేయకపోవడం మైనస్ అయింది.
ఓటీటీలో ఈ చిత్రం మంచి స్పందన తెచ్చుకుంది. దీని తర్వాత తిరువీర్ నటించిన ‘పాపం ప్రతాప్’ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది టీం. కానీ ఆ సినిమాలో ఏమో విషయం లేకపోవడంతో సరిగా ఆడలేదు. ఇప్పుడు తిరువీర్ నుంచి ‘ఓ సుకుమారి’ చిత్రం రాబోతోంది. ఇందులో ఐశ్వర్యా రాజేష్ లాంటి పేరున్న హీరోయిన్ అతడికి జోడీగా నటించింది. ఒక వెరైటీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మరి ఈ చిత్రమైనా తనకు హిట్ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నాడు తిరువీర్.
తన సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లలో, ఇంటర్వ్యూలో తిరువీర్ అమాయకంగా, నిజాయితీగా చెప్పే మాటలు వింటే తన మీద ఒకింత జాలేస్తుంది. ఇంత టాలెంట్ ఉండి, మంచి సినిమాలు చేస్తున్నా సరే అతడికి హీరోగా హిట్ పడట్లేదు. మార్కెట్ పడట్లేదు. తన గత సినిమాల ఫలితాల గురించి మాట్లాడుతూ.. ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ను ప్రమోట్ చేసుకోలేకపోవడం తప్పే అని.. కానీ ‘పాపం ప్రతాప్’ను బాగా ప్రమోట్ చేసినా మిక్స్డ్ టాక్ వల్ల ఆడలేదని తిరువీర్ చెప్పాడు.
ఐతే తన సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా.. ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుని తనకు బాగానే గుర్తింపు తెచ్చాయని అతనన్నాడు. స్కూల్ పిల్లలు ఇంటికి రాగానే మసూద, ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో సినిమాలను పెట్టమని తల్లిదండ్రులను అడుగుతారని తెలిసి తానెంతో సంతోషించానన్నాడు. ‘ఓ సుకుమారి’ తాను కోరుకున్న సక్సెస్‌ను కచ్చితంగా ఇస్తుందని.. ఇందులో కంటెంట్ ఉందని, ప్రమోషన్లు కూడా బాగా చేస్తున్నామని అతనన్నాడు. ఒకప్పుడు అవకాశాల కోసం వేరే వాళ్ల దగ్గరికి వెళ్లి అడిగేవాడినని.. ఇప్పుడు తననే వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయంటే తాను ఒక స్థాయికి ఎదిగినట్లే అని.. కాబట్టి కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నానని అతను చెప్పాడు.